కష్టపడి ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడంతో సదరు యువకుడికి కుటుంబీకులు పెళ్లి సంబంధం చూశారు. వారంలో పెళ్లి అనగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోయ బుచ్చన్న కుమారుడు రామానాయుడు గత ఏడాది ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొంది హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ నెల 14న తన వివాహం ఉండటంతో బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి తనగలకు బైక్ మీద వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామనాయుడు తలకు తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రామానాయుడును ఢీకొట్టిన మరో బైకు మీద ఉన్న వారిలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.