ఉగాది రుచులు.. కమ్మనైన వంటకాలు తయారు చేసుకుందాం ఇలా..!

-

మన తెలుగు వారి సంవత్సరాది పండగ అంటే అందరిలోనూ ఒక  ఉత్సాహం, సంతోషం ఉంటాయి. పండగ రోజు పొద్దున్నే లేచి నిత్య కృత్యాలు పూర్తి చేసి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని పిల్లల కేరింతలతో సంప్రదాయ వంటకాలతో చాల సంబరంగా జరుపుకుంటాము. దేవునికి పెట్టె నైవేద్యాలు పరమాన్నం, మామిడి కాయ పులిహోర, మొదలైనవి. వాటిని ఎలా తయారు చేయాలో చూద్దాం.

పరమాన్నం తయారికి కావలసిన పదార్ధాలు.. ఒక లీటర్ పాలు, అర కేజీ బెల్లం, యాభై గ్రాములు సగ్గు బియ్యం, యాభై గ్రాములు బియ్యం, నాలుగు యాలకులు, ఇంకా బాదం, జీడి పప్పు, కిస్‌మిస్ లు, రెండు టేబుల్ స్పూన్ లు నెయ్యి. ఇప్పుడు తయారి విధానం… ముందుగా సగ్గు బియ్యం, మామూలు బియ్యం లో కొద్దిగా నీళ్ళు పోసి నాన పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె లో పాలు పోసి పొంగు రానివ్వాలి. పొంగు వచ్చాక సగ్గు బియ్యం వేసి అవి సగానికి పైగా ఉడికాక మామూలు బియ్యం వేయాలి. ఇవి రెండు పాలలో ఉడుకుతుండగా వేరే పొయ్యి మీద ఒక గిన్నెలో బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్ళు పోసి కరిగించి వడకట్టుకోవాలి. ఈ లోగా బియ్యం పాలలో ఉడికిపోతే ఆ గిన్నె పొయ్యి మీద నుండి దించేయాలి. ఇప్పుడు వడకట్టుకున్న బెల్లాన్ని ఆ పాలలో పోసి కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇక చివరగా పొయ్యి మీద చిన్న బాణలి పెట్టి నెయ్యి వేసి కాగాక జీడి పప్పు, కిస్ మిస్, బాదం వేసి వేగించి పరమాన్నం లో వేసి కలుపుకోవాలి.

మామిడి కాయ పులిహోర తయారికి కావలసినవి…..రెండు కప్పుల బియ్యం, ఒక పచ్చి మామిడి కాయ, తగినంత సాల్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, పోపు సామాను, కరివేపాకు, చిన్న అల్లం ముక్క. ఇక ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం.. బియ్యం కడిగి రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల నీళ్ళు పోసి అన్నం సిద్దం చేసుకోవాలి. తరువాత మామిడి కాయ చెక్కు తీసి తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసి వేగాక పోపు దినుసులు వేసి వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. చివరగా కొద్దిగా పసుపు వేసి అన్నంలో కలపాలి. తురిమి పెట్టుకున్న మామిడి గుజ్జు, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి పులిహోర రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news