సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఖరారు అయింది. ఈ నెల 23న మేడారంకు సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఈ సందర్భంగా మేడారంలో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్థానిక అధికారులతో సమావేశమై పలు సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. మేడారం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ప్రణాళికలు అక్కడే సమీక్షించి ఖరారు చేయనున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆసియా అతిపెద్ద గిరిజన జాతర. వచ్చే జాతరకు ముందే అవసరమైన సదుపాయాలు, మౌలిక వసతులు సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన జరుగుతున్నట్లు సమాచారం.

మేడారం మహా జాతర తేదీలు
మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే సంవత్సరం జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతర జరగనుంది. జనవరి 28వ తేదీన సారలమ్మ, గోవిందా రాజు, పగడిద్దరాజు గద్దెలకు చేరుకుంటారు. ఇక జనవరి 29వ తేదీన సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. ఈనెల 30వ తేదీన భక్తులు… మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే 31వ తేదీన అమ్మవార్ల వనప్రవేశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.