చాలామంది మహిళల్లో మంగళసూత్రం, పక్కనే ఒక సేఫ్టీ పిన్ (Safety Pin)అందరికి కనిపించే దృశ్యమే ఇది. దండను సరిచేసుకోవడానికో, పాతకాలం నాటి అలవాటుతోనో ఈ చిన్న ఇనుప పిన్నును మంగళసూత్రానికి తగిలిస్తారు. కానీ సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఈ అలవాటు అంత మంచిది కాదట. ఈ చిన్న పిన్ను వల్ల దోషం వస్తుందని, అది భర్త అదృష్టానికి ఆటంకం కలిగిస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆ కారణం ఏమిటో తెలుసుకుందాం..
మంగళసూత్రం అనేది కేవలం ఒక నగ కాదు భారతీయ సంస్కృతిలో ఇది సౌభాగ్యానికి, భర్త దీర్ఘాయుష్షుకు ప్రతీక. అందుకే దీని విషయంలో చాలా పవిత్రతను, నియమాలను పాటిస్తారు. దురదృష్టవశాత్తూ మంగళసూత్రం పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని చీర లేదా జాకెట్కు సెట్ చేయడానికి లేదా పాత ఆభరణాలను దానికి తాత్కాలికంగా తగిలించడానికి చాలామంది మహిళలు సేఫ్టీ పిన్ను ఉపయోగిస్తారు.

సాంప్రదాయ నమ్మకాలు మరియు వాస్తు ప్రకారం మంగళసూత్రంపై సేఫ్టీ పిన్ పెట్టడం అశుభంగా పరిగణించబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఆ పిన్ను తయారైన వస్తువు. సేఫ్టీ పిన్ సాధారణంగా ఇనుము తో తయారు చేయబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం ఇనుము శనిదేవుడికి సంబంధించిన లోహం. శనిదేవుడు న్యాయాధిపతి అయినప్పటికీ, శుభకార్యాలు లేదా అత్యంత పవిత్రమైన వస్తువులకు ఇనుమును తగిలించడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు.
మంగళసూత్రం పవిత్రతకు చిహ్నం కాగా ఇనుము గ్రహ దోషాలకు సంబంధించిన లోహం. ఈ రెండింటి కలయిక వల్ల ఇంట్లో సానుకూల శక్తి బలహీనపడి, ఆర్థిక వనరుల వృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని ముఖ్యంగా భర్త పురోగతికి అడ్డుకలుగుతుందని చెబుతారు. అందుకే పవిత్రమైన మంగళసూత్రాన్ని ఇనుముతో కూడిన వస్తువులతో కలపడం లేదా దానికి పగుళ్ళు రావడం శుభకరం కాదని పెద్దలు హెచ్చరిస్తారు.
మంగళసూత్రానికి సేఫ్టీ పిన్ను పెట్టడం అనేది చాలా చిన్న అలవాటుగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక బలమైన సాంప్రదాయ నమ్మకాలు ఉన్నాయి. సౌభాగ్యానికి ప్రతీకగా భావించే మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఇనుము వంటి ప్రతికూల లోహాల స్పర్శ లేకుండా చూసుకోవడం శ్రేయస్కరం. ఈ నియమాన్ని పాటించడం ద్వారా భర్తకు మరియు కుటుంబానికి మరింత అదృష్టం, పురోగతి కలుగుతాయని విశ్వసించాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం పూర్తిగా మత విశ్వాసాలు మరియు సాంప్రదాయ ఆచారాలపై ఆధారపడినవి. వీటిని పాటించడం లేదా పాటించకపోవడం పూర్తిగా వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయం.