వయసు పెరగడం అనేది ఎవరు ఆపలేని ప్రక్రియే కావచ్చు, కానీ దాన్ని నెమ్మదింపజేసే తాళం చెవి మన ఆహారపు అలవాట్లలోనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖంపై ముడతలు రాకుండా, శరీరం లోపల అవయవాలు యవ్వనంగా ఉండాలంటే కేవలం క్రీములు రాస్తే సరిపోదు. ఇటీవల జరిగిన పరిశోధనలు “ఉపవాసం” (Fasting) కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన యాంటీ-ఏజింగ్ టూల్ అని నిరూపిస్తున్నాయి. సరైన పద్ధతిలో ఉపవాసం ఉండటం వల్ల మన కణాలు మళ్ళీ పునరుజ్జీవం పొందుతాయి. ఇప్పుడు ఉపవాసం లో కొన్ని పద్ధతులు తెలుసుకుందాం..
శరీరంలో జరిగే అద్భుత క్లీనింగ్ ప్రాసెస్: మనం ఆహారం తీసుకోకుండా తగినంత సమయం ఉన్నప్పుడు, మన శరీరంలో ‘ఆటోఫాజీ’ (Autophagy) అనే ఒక అద్భుతమైన ప్రక్రియ మొదలవుతుంది. సరళంగా చెప్పాలంటే ఇది మన కణాల్లో ఉండే చెత్తను శుభ్రం చేసే పద్ధతి. వయసు పెరిగే కొద్దీ కణాల్లో పేరుకుపోయే పనికిరాని ప్రోటీన్లు దెబ్బతిన్న కణజాలాలను శరీరం తానే స్వయంగా రీసైకిల్ చేసుకుంటుంది. ఉపవాసం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గి, శరీరంలో వాపులు తగ్గుతాయి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడి వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ – ఆధునిక జీవనశైలికి వరం: పూర్వం మన పెద్దలు వారానికి ఒకసారి ఉపవాసం ఉండేవారు, దాని వెనుక ఉన్న సైన్స్ ఇదే. ప్రస్తుతం ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ ద్వారా అంటే రోజులో 16 గంటలు ఖాళీ కడుపుతో ఉండి, 8 గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది కేవలం బరువు తగ్గడానికే కాకుండా, డిఎన్ఏ (DNA) డ్యామేజ్‌ను అరికట్టి ఆయుష్షును పెంచుతుంది. జీవక్రియలు మెరుగుపడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి, నిత్య యవ్వనంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఈ అలవాటు ఎంతగానో దోహదపడుతుంది.
వయసును వెనక్కి తిప్పలేకపోయినా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు క్రమబద్ధమైన ఉపవాసంతో దాన్ని నెమ్మదింపజేయడం మన చేతుల్లోనే ఉంది. యవ్వనంగా ఉండటం అంటే కేవలం బాహ్యంగా కనిపించే అందం మాత్రమే కాదు అంతర్గతంగా కణాలు దృఢంగా ఉండటం.
గమనిక: ఏదైనా కొత్త డైట్ లేదా ఉపవాస పద్ధతిని ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి వైద్యులను లేదా పోషకాహార నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.
