చీకటిని పారదోలి వెలుగు జిలుగులు నింపే దీపావళి పండుగ అంటేనే కంటి నిండా ఆనందం. అయితే ఈ వేడుకల్లో మనం కాల్చే టపాసులు, వెలిగించే దీపాల వల్ల మన కళ్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కంటి చూపు కంటే విలువైనది ఏదీ లేదు కదా? మరి ఆనందంగా పండుగను జరుపుకుంటూనే మన కళ్లను సురక్షితంగా ఎలా కాపాడుకోవాలి? అగ్ని ప్రమాదాలు లేదా చిన్న గాయాలు కాకుండా నిపుణులు చెబుతున్న ముఖ్యమైన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..
దీపావళి పండుగ సందర్భంగా కంటికి గాయాలయ్యే కేసులు పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో చాలా వరకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు.
టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: టపాసులు కాల్చేటప్పుడు ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దలు కూడా కొన్ని నియమాలను పాటించాలి.
సురక్షిత దూరం పాటించండి: టపాసులు పేల్చేటప్పుడు వాటికి తగినంత దూరంలో ఉండాలి. పేలిన తర్వాత వచ్చే పొగ, నిప్పురవ్వలు కంట్లో పడకుండా చూసుకోవాలి.

కంటి అద్దాలు (Eye Protection): టపాసులు కాల్చేటప్పుడు కళ్లకు రక్షణ కల్పించే అద్దాలు (Safety Goggles) ధరించడం అత్యంత ఉత్తమం, ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా ధరించాలి.
పాత పటాకులను మళ్లీ కాల్చవద్దు: పేలని పాత పటాకులను దగ్గరకెళ్లి మళ్లీ కాల్చడానికి ప్రయత్నించవద్దు. వాటిని వెంటనే నీళ్లలో పడేయాలి.
ముఖం దగ్గర ఉంచవద్దు: టపాసులు వెలిగించేటప్పుడు మీ ముఖాన్ని (Face) లేదా కళ్లను వాటికి దగ్గరగా ఉంచకండి.
దీపాలు, రంగులు, రసాయనాల విషయంలో జాగ్రత్త: టపాసులే కాకుండా, ఇతర దీపావళి అంశాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. దీపాలు కొవ్వొత్తులుతో దీపాలను వెలిగించేటప్పుడు లేదా ఆరిపోయిన దీపాలను చూసేటప్పుడు వాటి నుంచి వచ్చే వేడి లేదా పొగ కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి.ఇక రంగులు, రంగోలీ రంగులలో రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఆ రంగులు చేతికి అంటుకుని, అదే చేతితో కళ్లను రుద్దుకోకూడదు. లెన్స్ వాడేవారు జాగర్త, కాంటాక్ట్ లెన్స్ (Contact Lens) ధరించేవారు దీపావళి పొగ, దుమ్ము ధూళి ఎక్కువగా ఉన్న చోట్ల వాటిని తీసేసి సాధారణ అద్దాలు వాడటం మంచిది.
మీరు పండుగను పూర్తి ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలంటే కంటి సంరక్షణ విషయంలో రాజీ పడకూడదు. పండుగ వెలుగులను ఆస్వాదిస్తూ మీ కళ్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే కళ్లు ఆరోగ్యంగా ఉంటేనే ఈ అద్భుతమైన దీపాల కాంతులను చూడగలం.