డయాబెటిస్ ఉన్నవారికి లేదా ప్రీ-డయాబెటిక్ స్థితిలో ఉన్నవారికి భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఒక పెద్ద సమస్య. ఈ హెచ్చుతగ్గులు దీర్ఘకాలంలో గుండె, నరాలు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే మందులు మాత్రమే వేసుకోవటం కాదు, కేవలం జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచవచ్చని నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్షణ నివారణ, చిన్న నడక : భోజనం చేసిన వెంటనే షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. దీన్ని నియంత్రించడానికి డాక్టర్లు ప్రధానంగా సూచించే సహజ పద్ధతి చిన్నపాటి నడక (Post-meal walk). తిన్న వెంటనే అరగంట తర్వాత 10 నుంచి 15 నిమిషాలు మెల్లగా నడవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. నడక ద్వారా కండరాలు శక్తి కోసం గ్లూకోజ్‌ను వినియోగిస్తాయి, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పడిపోతాయి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సులభమైన అలవాటును రోజూ మూడు పూటలా పాటించడం చాలా మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆహారంలో మార్పులు మరియు సహజ చిట్కాలు: షుగర్‌ను కంట్రోల్ చేయడానికి కేవలం నడక మాత్రమే కాదు, ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. కార్బోహైడ్రేట్‌లను నియంత్రించడం భోజనంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి. తెలుపు బియ్యం, మైదా ఉత్పత్తుల కంటే ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు (ఓట్స్, రాగులు), పప్పులు తీసుకోవాలి. ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది.
మెంతులు : రాత్రి నానబెట్టిన మెంతి నీరు ఉదయం తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా అదనపు గ్లూకోజ్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.
భోజనం తర్వాత షుగర్ కంట్రోల్‌కు మందులు మాత్రమే పరిష్కారం కాదు. రోజూ 15 నిమిషాల నడక, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, మరియు సరైన జీవనశైలి మార్పులు చేసుకుంటే, చక్కెర స్థాయిలను సులభంగా మరియు సహజంగా అదుపులో ఉంచుకోవచ్చు. మీ ఆరోగ్య ప్రయాణంలో నిపుణుల సలహాలను పాటించడం అత్యంత ముఖ్యం.
గమనిక: మధుమేహం ఉన్నవారు మందులతో పాటు ఈ సహజ పద్ధతులను అనుసరించే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాలి.
