ప్రేమబంధం అంటే ఎప్పుడూ నవ్వులు, మాటలు, సందడిగా ఉండటమే అనుకుంటాం. కానీ, కొన్ని బంధాలు ఉంటాయి.. అవి చాలా సైలెంట్‌గా, ప్రశాంతంగా సాగిపోతుంటాయి. బయటి ప్రపంచానికి పెద్దగా తమ గురించి చెప్పుకోరు, గొడవలు కూడా రావు. మరి ఇలాంటి నిశ్శబ్ద బంధం నిజంగా బలమా? లేక లోపల ఏదో సమస్య దాగి ఉన్న బలహీనతా? మానసిక నిపుణులు ఈ అంశంపై ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
నిశ్శబ్ద బంధం ఎప్పుడు బలం అవుతుంది?: నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక సంబంధం ఎటువంటి గొడవలు లేకుండా, ప్రశాంతంగా ఉందంటే, దానికి కారణం భాగస్వాముల మధ్య ఉన్న అధిక స్థాయి పరస్పర అవగాహన. ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను, అవసరాలను, ఏకాంతాన్ని గౌరవించుకుంటారు. ఇక్కడ సైలెంట్ అంటే “మాట్లాడకపోవడం” కాదు, “పోరాడకపోవడం”. వారు చిన్న విషయాలకు శక్తిని వృథా చేయకుండా, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ బంధంలో ఇద్దరి మధ్య బలమైన నమ్మకం, అంతర్గత కమ్యూనికేషన్ ఉంటాయి. ఇటువంటి నిశ్శబ్దం బంధానికి బలం అవుతుంది.

నిశ్శబ్ద బంధం ఎప్పుడు బలహీనత అవుతుంది?: అయితే, కొన్ని సందర్భాల్లో ఈ నిశ్శబ్దం ప్రమాదకరం. ఇక్కడ సైలెంట్ అంటే సమస్యలను అణచివేయడం (Suppressing Issues) అని అర్థం. ఒక భాగస్వామి తమ భావాలను, కోరికలను వ్యక్తపరచడానికి భయపడి లేదా నిరాకరించి మౌనంగా ఉంటే, ఆ మౌనం బంధాన్ని లోపల నుంచే బలహీనపరుస్తుంది. గొడవలు రావడం లేదంటే, సమస్యలు పరిష్కరించబడ్డాయని కాదు, వాటిని దాచిపెట్టారని అర్థం. ఇలాంటి సందర్భాలలో, నిశ్శబ్దం అనేది భావోద్వేగ దూరాన్ని పెంచుతుంది, కాలక్రమేణా ఆ సంబంధం విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది.
నిశ్శబ్దంగా ఉన్న సంబంధం బలమా లేక బలహీనతా అనేది… ఆ నిశ్శబ్దం ప్రేమ, అవగాహన నుండి వచ్చిందా, లేక భయం, నిరాకరణ నుండి వచ్చిందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సంబంధంలో నిశ్శబ్దం కూడా ఒక భాగమే. కానీ, ఎప్పుడైనా మీకు అసౌకర్యంగా అనిపిస్తే, ఆ నిశ్శబ్దాన్ని భయం లేకుండా ఛేదించడం ముఖ్యం. మీ భాగస్వామితో మాట్లాడండి.
