విశ్వం అనేది కేవలం గ్రహాలు, నక్షత్రాల కలయిక మాత్రమే కాదు. ప్రతి దిక్కుకు ఒక రక్షకుడు పాలకుడు ఉంటాడని మన పురాణాలు చెబుతున్నాయి. వారే అష్టదిక్పాలకులు! ఈ ఎనిమిది మంది దేవతలు కేవలం దిక్కులను పర్యవేక్షించడమే కాదు విశ్వంలో సమతుల్యత మరియు ధర్మాన్ని కాపాడుతుంటారు. ఈ శక్తివంతమైన దేవతలు ఎవరు? వారి శక్తి ఏమిటి? వారిని పూజిస్తే మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసుకుందాం.
భారతీయ ధర్మశాస్త్రం ప్రకారం, విశ్వం యొక్క ఎనిమిది ప్రధాన దిక్కులను పాలించే దేవతలే అష్టదిక్పాలకులు. వీరిలో ప్రతి ఒక్కరికి వారిదైన ప్రత్యేక శక్తి, వాహనం మరియు ఆయుధం ఉంటాయి. తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తాడు ఈయన వర్షానికి, ఉరుములకు అధిపతి. ఈయన ఆశీస్సులు శ్రేయస్సును, విజయాన్ని అందిస్తాయి.

ఆగ్నేయ దిక్కును అగ్ని దేవుడు పాలిస్తాడు, ఈయన పవిత్రతకు, శుద్ధికి ప్రతీక. దక్షిణ దిక్కుకు యముడు అధిపతి, ఈయన ధర్మదేవత, న్యాయాన్ని, కర్మ ఫలితాన్ని నిర్ణయిస్తాడు. నైరుతి దిక్కును నిరృతి (రాక్షసులకు అధిపతి) పాలిస్తాడు ఈయన శక్తిని రక్షణను అందిస్తాడు. పశ్చిమ దిక్కును వరుణ దేవుడు పాలిస్తాడు, ఈయన నీటికి, వర్షానికి అధిపతి. వాయువ్య దిక్కును వాయు దేవుడు పాలిస్తాడు, ఈయన చలనం, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు.
ఇక ఉత్తర దిక్కును కుబేరుడు పాలిస్తాడు ఈయన సంపదకు, ఐశ్వర్యానికి అధిపతి. చివరగా, ఈశాన్య దిక్కును ఈశానుడు (శివుడు) పాలిస్తాడు, ఈయన జ్ఞానానికి, మోక్షానికి ప్రతీక. అందుకే మనం ఆలయాలలో లేదా ఇళ్లలో వాస్తు శాస్త్రాన్ని అనుసరించేటప్పుడు ఈ దిక్పాలకుల శక్తిని దృష్టిలో ఉంచుకొని ఆయా దిక్కులను పవిత్రంగా ఉంచుతాము. ఈ దేవతలను పూజించడం వలన మన జీవితంలో సమతుల్యత, రక్షణ మరియు శ్రేయస్సు లభిస్తాయి.
గమనిక: అష్టదిక్పాలకుల పేర్లు మరియు వారి పాలనా అంశాలు వివిధ పురాణ గ్రంథాలు, ప్రాంతాలను బట్టి స్వల్పంగా మారవచ్చు. ఈ కథనం భారతీయ ధార్మిక, వాస్తు శాస్త్రాలపై ఆధారపడి ఉంది.
