13 ఏళ్ల వయసు అంటే…అది పూర్తిగా చిన్నపిల్లల దశ కూడా కాదు, అలాగే పెద్దల యవ్వనం కూడా కాదు.ఈ వయసులో హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. మనసు కొత్త కొత్త భావాలతో నిండిపోతుంది. అందుకే పిల్లల మనసులో “ప్రేమ” లాంటి భావనలు రావడం చాలా సహజం. అయితే తల్లిదండ్రులుగా ఇది తెలిసినప్పుడు కొంచెం ఆందోళన పడటం కూడా సహజమే. కానీ ఇలాంటి విషయాల్లో, కోపంగా స్పందించడంకంటే అర్థం చేసుకొని శాంతంగా మాట్లాడటం చాలా ముఖ్యము. ఈ పరిస్థితిని ఒక సమస్యగా కాకుండా, మీ పిల్లలతో మరింత దగ్గరయ్యే ఒక మంచి అవకాశంగా మార్చుకోండి. వాళ్ల భావాలను వినండి వాళ్లతో స్నేహితుల్లా మాట్లాడండి, అప్పుడు మీ బంధం మరింత బలపడుతుంది.
13 ఏళ్ల వయసులో ఆకర్షణ: పిల్లలు పెద్దవాళ్లవుతూ ఉండే సమయంలో వారి శరీరంలోనూ, మనసులోనూ చాలా మార్పులు జరుగుతాయి. ఈ వయసులో ఎవరికైనా ఇష్టం కలగడం, ఆకర్షణ అనిపించడం అనేది చాలా సహజమైన విషయం. ఇది ఏదో తప్పు కాదు ఇది ఒక జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే. కాబట్టి దీనిని భయపడాల్సిన విషయం కాదు అర్థం చేసుకోవాల్సిన విషయం.
మీ అబ్బాయి లేదా అమ్మాయి ఎవరినో ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడు ఒక్కసారిగా షాక్ అవడం, అరవడం, కోపపడడం లేదా కఠినంగా మాట్లాడడం చేయకండి. మీరు ఎంత కఠినంగా ఉంటే వారు అంతగా విషయాలను మీతో పంచుకోవడం మానేస్తారు. ముందుగా మీరు ప్రశాంతంగా ఉండండి. చాలా సందర్భాల్లో ఇది కేవలం తాత్కాలిక ఆకర్షణ మాత్రమేనని గుర్తుంచుకోండి.

తల్లిదండ్రులు ఎలా స్పందించాలి?: పిల్లలతో తల్లిదండ్రులుగా కాకుండా, ఒక స్నేహితుడిలా మాట్లాడండి. “నువ్వు చేసేది తప్పు” అని తీర్పు చెప్పే ముందు, వారి మనసులో నిజంగా ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. “నీ వయసులో ఇలాంటి భావాలు రావడం సహజమే నాకూ చిన్నప్పుడిలాగే అనిపించేది” అని చెప్పడం వాళ్లలో భయాన్ని తగ్గిస్తుంది, మీపై నమ్మకాన్ని పెంచుతుంది.
ఈ వయసులో కలిగే భావాలు నిజమైన ప్రేమ కంటే ఎక్కువగా ఒక ఆకర్షణ మాత్రమే అని సులభమైన మాటల్లో వారికి అర్థమయ్యేలా చెప్పండి. జీవితంలో చదువు, కెరీర్, లక్ష్యాలు ఎంత ముఖ్యమో వారికి వివరించండి. ఏది ముందుగా రావాలో, ఏది తర్వాత రావాలో ప్రాధాన్యతలు గుర్తించేలా వారిని మెల్లగా మార్గనిర్దేశం చేయండి.
పిల్లలను పూర్తిగా కట్టడి చేయడం, వారి ఫోన్లు చెక్ చేయడం, గదిలో బంధించడం లాంటి పనులు చేయకండి. దాని బదులు, సోషల్ మీడియా వాడకం, స్నేహితులతో గడిపే సమయం విషయంలో సున్నితంగా కొన్ని నిబంధనలు పెట్టండి. అలాగే క్రీడలు, సంగీతం, డ్యాన్స్ లాంటి వారికి ఇష్టమైన హాబీల వైపు వారి దృష్టి మళ్లేలా ప్రోత్సహించండి. అలా చేస్తే వారి మనసు పాజిటివ్ దిశలో ముందుకు వెళ్తుంది.
ముఖ్య గమనిక: మీ పిల్లలు మీతో ఏదైనా విషయాన్ని భయం లేకుండా పంచుకోగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పించండి. అదే మీరు వారికి ఇచ్చే అతిపెద్ద రక్షణ.
