పిల్లల చర్మం చలికాలంలో ఎందుకు పొడిబారుతుంది? కారణాలు, జాగ్రత్తలు

-

చలికాలం వచ్చిందంటే పిల్లల ఆటలు పండుగల సరదా, స్కూల్ సెలవులు… అన్నీ కలసి ఇంట్లో సందడి మొదలవుతుంది. కానీ అదే సమయంలో చాలా మంది తల్లిదండ్రులు గమనించే సమస్య ఏమిటంటే, పిల్లల చర్మం పొడిబారడం. ముఖం మీద తెల్లటి పొరలు, చేతులు,కాళ్లపై రఫ్‌గా మారడం కొన్నిసార్లు దురద కూడా. ఇంత చిన్న వయసులోనే ఇలా ఎందుకు వస్తుంది అనే సందేహం తల్లిదండ్రులకు సహజంగా కలుగుతుంది. మరి చిన్నారుల చర్మాన్ని చలికాలం లో ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..

నిజానికి పిల్లల చర్మం పెద్దల కంటే చాలా సున్నితమైనది. చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల చర్మం లోని సహజ తైలాలు త్వరగా పోతాయి. అంతేకాదు, వేడి నీళ్లతో స్నానం చేయించడం, సబ్బులు ఎక్కువగా వాడడం, బయట చల్లని గాలికి ఎక్కువసేపు తగలడం వంటివి కూడా చర్మాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకే ఈ కాలంలో చిన్నారుల చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పిల్లల చర్మం పొడిబారడానికి ప్రధాన కారణాలు చూస్తే.. మొదటిగా చలికాలంలో తేమ తక్కువగా ఉండటం వల్ల చర్మం త్వరగా ఎండిపోతుంది. రెండవది, వేడి నీటితో రోజూ స్నానం చేయించడం వల్ల చర్మంపై ఉన్న సహజ రక్షణ పొర తొలగిపోతుంది. మూడవది, కెమికల్స్ ఉన్న సబ్బులు, షాంపూలు వాడటం కూడా చర్మాన్ని రఫ్‌గా చేస్తాయి.

Winter Dry Skin in Kids: Hidden Reasons and Simple Precautions
Winter Dry Skin in Kids: Hidden Reasons and Simple Precautions

అలాగే చలికాలం కదా అని పిల్లలు నీళ్లు తక్కువగా తాగడం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్ తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం లోపల నుంచే పొడిబారుతుంది. కొంతమంది పిల్లలకు అలెర్జీలు లేదా ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నా చలికాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా తగ్గించవచ్చు. పిల్లలను గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయించాలి, వేడి నీటిని వీలైనంత వరకు నివారించాలి. స్నానం చేసిన వెంటనే మంచి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె లాంటి సహజ ఆయిల్ రాయడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లే ముందు చేతులు, ముఖంపై క్రీమ్ అప్లై చేయాలి.

రోజుకు తగినంత నీళ్లు తాగేటట్లు చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పాలు వంటి పోషకాహారం చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. వాటిని చిన్నారులకు తప్పక ఇవ్వాలి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కూడా మీ పిల్లల చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, చర్మం ఎక్కువగా పగిలిపోతే, ఎర్రబడితే లేదా దురద తగ్గకపోతే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

Read more RELATED
Recommended to you

Latest news