ఇంట్లో ప్రశాంతత కలగాలన్న, శుభంచేకూరాలన్న, ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలంటే మన ఇంట్లో పూజ గది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోజూ దేవుడి ముందు దీపం వెలిగించి ప్రార్థన చేయగానే మనసుకు ఓ ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. కానీ పూజ గది సరైన విధంగా ఏర్పాటు చేయకపోతే ఆ శాంతి పూర్తిగా అనుభూతి కాకపోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఉన్న స్థానం, అక్కడ ఉంచే వస్తువులు, మనం పాటించే అలవాట్లు అన్నీ కలిసి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. అందుకే పూజ గది వాస్తు నియమాలు తెలుసుకుని అమలు చేయడం చాలా అవసరం.
వాస్తు ప్రకారం పూజ గది ఇంటి ఈశాన్య (ఉత్తర–తూర్పు) మూలలో ఉండటం అత్యంత శుభం. ఈ దిశ ఆధ్యాత్మిక శక్తికి అనుకూలంగా ఉంటుందని నమ్మకం. దేవతల విగ్రహాలు లేదా ఫోటోలు తూర్పు లేదా పశ్చిమం వైపు చూసేలా ఉంచాలి, మనం ప్రార్థన చేసే సమయంలో తూర్పు లేదా ఉత్తర దిశలో నిలబడితే మంచిది. పూజ గదిలో అస్తవ్యస్తంగా పగిలిన విగ్రహాలు, పాత పువ్వులు, కాలిపోయిన దీపాలు ఉంచకూడదు.

అక్కడ ఎప్పుడూ శుభ్రత వుంచాలి. పూజ గదిని టాయిలెట్‌కు పక్కన లేదా మెట్ల కింద ఏర్పాటు చేయడం వాస్తు ప్రకారం మంచిది కాదు. అలాగే బెడ్రూమ్లో పూజ గది ఉంటే ఆధ్యాత్మిక వాతావరణం తగ్గుతుందని చెబుతారు. దీపం, ధూపం, అగరబత్తీలు వాడేటప్పుడు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
పూజ గది కేవలం ఒక గది మాత్రమే కాదు, అది మన మనసుకు ప్రశాంతత ఇచ్చే పవిత్ర స్థలం. అక్కడ కూర్చొని కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ఉదయం లేదా సాయంత్రం ఒకే సమయానికి ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి మరింత బలపడుతుంది. వెలుతురు, శుభ్రత సువాసనతో కూడిన పూజ గది ఇంట్లో శుభాన్ని నిలబెట్టే శక్తి కలిగి ఉంటుంది.
గమనిక: పైన ఇచ్చిన వాస్తు నియమాలు మార్గదర్శకాలు మాత్రమే. ముఖ్యంగా భక్తి, నమ్మకం, శుభ్రమైన మనసే ఇంట్లో నిజమైన శాంతిని తీసుకువస్తాయి.
