పాస్తా పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే దేశం ఇటలీ. కానీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే ఈ రుచికరమైన వంటకం నిజంగా ఎక్కడ పుట్టిందో తెలుసా? ఇటలీ తనదని వాదిస్తుంటే, చైనా చరిత్ర మరోలా చెబుతోంది. అసలు మార్కో పోలో చైనా నుండి పాస్తాను ఇటలీకి తెచ్చాడా? లేక అంతకు ముందే అక్కడ ఉందా? ఈ రుచికరమైన వంటకం వెనుక ఉన్న ఆసక్తికరమైన చారిత్రక రహస్యాలను తెలుసుకుందాం..
చైనా వెర్షన్- ప్రాచీన నూడుల్స్ ఆనవాళ్లు: పాస్తా లేదా నూడుల్స్ వంటి వంటకాలు చైనాలోనే పుట్టాయని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. 2005లో చైనాలోని ‘లాజియా’ (Lajia) అనే ప్రాంతంలో శాస్త్రవేత్తలు సుమారు 4,000 ఏళ్ల నాటి నూడుల్స్ ఉన్న మట్టి పాత్రను కనుగొన్నారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నూడుల్స్‌గా గుర్తించబడ్డాయి.
ప్రసిద్ధ యాత్రికుడు మార్కో పోలో 13వ శతాబ్దంలో చైనా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటు ఈ వంటకాన్ని ఇటలీకి తీసుకెళ్లాడనేది ఒక ప్రచారంలో ఉన్న కథ. అయితే, ఇటాలియన్లు దీనిని కేవలం ఒక పుకారుగా కొట్టిపారేస్తారు.

ఇటలీ వాదన- మధ్యధరా ప్రాంతపు సొంత రుచి: ఇటలీ చరిత్రకారుల ప్రకారం, మార్కో పోలో రాకకంటే ముందే అరబ్బుల ద్వారా పాస్తా ఇటలీకి చేరుకుంది. 4వ శతాబ్దానికి చెందిన రోమన్ సమాధులలో పాస్తా తయారీకి వాడే పరికరాల వంటి చిత్రాలు కనిపించాయి.
ముఖ్యంగా అరబ్బులు ఎడారి ప్రయాణాల్లో ఎక్కువ కాలం నిలువ ఉండే ‘డ్రై పాస్తా’ను వాడేవారని అది సిసిలీ ద్వీపం ద్వారా ఇటలీ అంతటా విస్తరించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఇటలీలో దొరికే ‘డ్యూరమ్ వీట్’ తో తయారైన పాస్తా చైనా నూడుల్స్ కంటే భిన్నమైనదని, అందుకే ఇది ఇటలీ సొంత ఆవిష్కరణ అని వారి వాదన.
మూలాలు ఎక్కడైనా.. రుచి మాత్రం అద్భుతం!: ఏది ఏమైనా పాస్తా పుట్టుక గురించి ఇటలీ, చైనాల మధ్య చర్చ ఎంత కాలం సాగినా, అది నేడు ప్రపంచ పౌరులందరి వంటకంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం పిండి మరియు నీటితో మొదలైన ఈ ప్రయాణం, నేడు వందలాది ఆకారాలు మరియు రుచులతో మన ప్లేట్లలోకి చేరుతోంది.
చారిత్రక ఆధారాల ప్రకారం చైనాలో నూడుల్స్ మొదలైనప్పటికీ, పాస్తాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును, సంస్కృతిని అందించింది మాత్రం ఇటలీ దేశమే అనడంలో సందేహం లేదు. మూలాలు ఏదైనా, వేడివేడి పాస్తాను ఆస్వాదించే ఆ మజానే వేరు అంటున్నారు భోజన ప్రియులు.
