సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది చివరలో భూమి తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోబోతోంది, ఇక మనమంతా గాలిలో తేలిపోతాం అంటూ నాసా పేరుతో ప్రచారమవుతున్న ఈ వార్త సామాన్యులను భయాందోళనకు గురిచేస్తోంది. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా కథలా ఉన్నా ఇందులో నిజమెంత? సైన్స్ ఏం చెబుతోంది? అసలు నాసా అటువంటి హెచ్చరికలు జారీ చేసిందా? మరి అసలు నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా ప్రచారం- పుకార్ల వెనుక అసలు కథ: ఇటీవల ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఒక సంచలన వార్త హల్చల్ అవుతోంది. భూమి యొక్క అంతర్భాగంలో వస్తున్న మార్పుల వల్ల ఈ ఏడాది చివరి నాటికి Gravity (గురుత్వాకర్షణ శక్తి) సున్నా అవుతుందని దీనివల్ల భవనాలు కూలిపోయి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారని ఆ పోస్టుల సారాంశం.
అయితే, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. నాసా (NASA) ఎప్పుడూ ఇటువంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి, భూమి వంటి భారీ గ్రహం తన గురుత్వాకర్షణను అకస్మాత్తుగా కోల్పోవడం భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం అసాధ్యం. ఇవన్నీ కేవలం వ్యూస్ కోసం సృష్టించిన తప్పుడు వార్తలు మాత్రమే.

శాస్త్రీయ దృక్పథం, భూమి గ్రావిటీ అంత బలహీనమా?: భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి దాని ద్రవ్యరాశి (Mass) మీద ఆధారపడి ఉంటుంది. ఒక గ్రహం తన గ్రావిటీని కోల్పోవాలంటే, అది తన ద్రవ్యరాశిని పూర్తిగా కోల్పోవాలి లేదా అదృశ్యం కావాలి. భూమి పరిమాణం లేదా బరువులో అకస్మాత్తుగా మార్పులు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ భూమి అయస్కాంత క్షేత్రంలో చిన్నపాటి మార్పులు వచ్చినా, అది గురుత్వాకర్షణను ప్రభావితం చేయదు.
సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సమాచారం ఎంత వేగంగా అందుతుందో, తప్పుడు వార్తలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇటువంటి తప్పుడు ప్రచారం ప్రజల్లో అనవసరమైన భయాన్ని నింపుతాయి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే నాసా లేదా ఇస్రో వంటి అధికారిక సంస్థలు తమ వెబ్‌సైట్ల ద్వారా నేరుగా వెల్లడిస్తాయి. కాబట్టి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా, వాటి వెనుక ఉన్న నిజాన్ని విశ్లేషించడం మన బాధ్యత.
