వర్షాకాలంలో.. ఇంటి పంటలు.. ఎత్తు మడులే బెస్ట్ ఛాయిస్

-

వర్షాకాలం వచ్చిందంటే.. అన్నదాతలు ఆనంద పడాలో భయపడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఉద్ధృతంగా వస్తోన్న వరదలు పంటలను నీటముంచేస్తున్నాయి. పెట్టుబడి అంతా కళ్లెదుటే నీటిపాలవడం చూసి రైతులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో కూరగాయల సాగు కూడా కష్టతరమైపోతోంది. దీనివల్ల కాయగూరల లభ్యత తగ్గిపోయి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు కూరగాయలు కొనడం మానేయలేక.. అధిక ధరలు చెల్లించలేక సతమతమవుతుంటారు. అధిక ధరలు చెల్లించి కూరగాయలు కొనకుండా.. అలాగని పప్పులతోనే కడుపు నింపేసుకోకుండా మీకో సూపర్ ఐడియా. అదేంటంటే..?

మనం తినే ఆకుకూరలు, కూరగాయలను వీలైనంత వరకు మనకు మనమే ఇంటి పట్టున, ఎంత కొంచెం స్థలం ఉన్నా సరే, సేంద్రియంగా పండించుకునే ప్రయత్నం ఇప్పటికైనా మొదలు పెట్టడం ఉత్తమం. కొద్ది స్థలాల్లో, పెరట్లో కూరగాయలు పెంచే సన్నకారు రైతులు గానీ.. డాబా/మేడ పైన, ఇంటి ముందు, వెనుక ఖాళీ స్థలాల్లో కూరగాయలు సాగు చేసుకునే వారు గానీ ఎత్తుమడుల (రెయిజ్డ్‌ బెడ్స్‌)ను నమ్ముకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చదును సాళ్లలో కన్నా బోదెలు తోలి లేదా ఎత్తు మడులు చేసుకోవటం మేలు. వర్షాలు ఎక్కువైనా లేదా తక్కువైనా ఇవి ఆదుకుంటాయన్నది ‘వరల్డ్‌ వెజిటబుల్‌ సెంటర్‌’ నిపుణుల సూచన.

ఎత్తుమడులను ఏర్పాటు చేసుకొని కూరగాయ పంటలు నాటుకుంటే భారీ వర్షం కురిసినా నీటి ముంపు సమస్య ఉండదు. కాబట్టి నష్టం అంతగా ఉండదు. అధిక తేమ సమస్య నుంచి భూమిపై పెరుగుతున్న మొక్కల కన్నా ఎత్తు మడుల్లో పెరిగే మొక్కలు త్వరగా కోలుకుంటాయి.ఎత్తు మడిని ఇటుకలతో లేదా చెక్కలతో లేదా వెదురు బద్దలతో కూడిన దడితో గానీ.. ఏర్పాటు చేసుకోవచ్చు. ఎత్తు మడిని నేరుగా నేలపైన / మేడపైన / ఇంటి ముందు, వెనుక, పక్కన ఖాళీ జాగాల్లో గచ్చుపైన ప్లాస్టిక్‌ షీట్‌ వేసి ఏర్పాటు చేసుకోవచ్చు.

అడుగున ఏమీ లేకుండా మట్టిపైనే ఎత్తుమడిని నాలుగు వైపులా ఇటుకలో, చెక్కలో పెట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు.. నేల పైపొర గట్టిపడి ఉంటుంది. దానిపైనే మడిని ఏర్పాటు చేస్తే మొక్కల వేర్లు ఆ గట్టిపడిన నేలలో నుంచి కిందికి వెళ్లడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ఎత్తుమడి ఏర్పాటు చేసుకునే స్థలంలో అరడుగు లోతు మట్టిని తవ్వి తీసి వేసి.. అక్కడ ఎత్తుమడిని ఏర్పాటు చేసుకుంటే మేలు.

ఎత్తు మడికి నాలుగు వైపులా గోడలు కూడా భారీ వర్షానికి, నీటి ప్రవాహానికి దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్థానికంగా దొరికే రాళ్లు, అరటి బెదెలు, కట్టెలు లేదా చెక్క ప్యానళ్లను ఎత్తు మడి చుట్టూతా దన్నుగా పెట్టుకుంటే ఎత్తుమడి కింద మట్టి కోతకు గురికాకుండా ఉంటుంది.
ఎత్తు మడులను ఏటవాలుగా ఉండే నేలపై ఏర్పాటు చేసుకోకూడదు.

చదరంగా ఉండే నేలపైనే ఏర్పాటు చేయాలి. ఎత్తుమడి లోపల మట్టి మిశ్రమం సమతలంగా ఉండాలి. మొక్కల మధ్య గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేసుకుంటే.. వాన నీటి ధాటికి విత్తనాలు, మట్టి, మట్టితో పాటు పోషకాలు కొట్టుకుపోకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version