ఈరోజుల్లో మహిళలు వంటింటికే పరిమితం అవ్వాలి అనుకోవడం లేదు. పెళ్లి తర్వాత కూడా సంపాదించాలనే ఆలోచన అందరిలో ఉంది. దీనికోసం ఉద్యోగమే చేయనక్కర్లేదు. చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేయొచ్చు. చాలా మంది అలానే చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు. అలాంటి వ్యాపారాల్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. అంత శ్రమ లేకుండా సాంకేతిక సాయంతో ఈ పని చేసేయొచ్చు.
సాంకేతికపరిజ్ఞానంతో రకరకాల కంపెనీలకు చెందిన ఎంబ్రాయిడరీ మిషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొదటిలో భారీగా ఉన్న ఈ ధరలు రాను రాను తగ్గుముఖం పట్టడంతో ఎక్కువ మంది మహిళలు ఈ మిషన్లను కొని తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. కేవలం లక్ష, లక్షన్నర రూపాయల పెట్టుబడితో ఈ ఎంబ్రాయిడరీ మిషన్లు అత్యంత అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి రావడంతో వీటిపై డిజైన్ తయారు చేయడం కూడా సులువుగా ఉంటుంది.
ఈ ఎంబ్రాయిడరీ మిషన్‌లకు కంప్యూటర్ డిజైనింగ్ సౌకర్యం కూడా ఉండటంతో పని మరింత తేలిక అవుతుంది. ఇక అందమైన డిజైన్లు కస్టమర్లకు ఇచ్చే సర్వీస్‌ని బట్టి వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉంటుంది అంటున్నారు మహిళామణులు. జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఈ ఎంబ్రాయిడరి మిషన్లను తమ ఉపాధి అవకాశాలుగా మలచుకుంటున్నారు.
కాబట్టి ఇంట్లో ఉండి బోర్ కొడుతున్నా, భర్తకు ఎంతోకొంత సాయం చేయాలనుకునే మహిళలకు ఈ వ్యాపారం లాభసాటి అని చెప్పవచ్చు. మీకు కాస్త అవగాహన ఉంటే చాలు చేసేయొచ్చు. మీకు ఆసక్తి ఉంటే దీనిగురించి మరింత సమాచారం తెలుసుకుని స్టెప్ తీసుకోవచ్చు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. అప్పుడే వారి జీవితం వాళ్ల చేతుల్లో ఉంటుంది. చాలా మంది మహిళలకు పెళ్లి తర్వాత జాబ్ చేయడం మానేస్తారు. భర్తకు ఇష్టంలేదనో, మీకు కుదరడం లేదనో మానేస్తే.. కొన్నేళ్లకు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీరే బాధపడతారు. కాబట్టి వీలైనంత వరకూ ఆర్థికంగా మీరు బలంగా ఉండేలా కేరీర్‌ను ప్లాన్ చేసుకుంటే ఉత్తమమని నిపుణులు ఇచ్చే సలహా..!