నిమ్మగడ్డిసాగుతో లక్షల్లో ఆదాయం.. కరువు నేల కూడా అనుకూలం

-

వ్యవసాయం చేస్తూ కూడా లక్షలు సంపాదించవచ్చు. మార్కెట్‌లో ఏ పంటకు ఎక్కువ డిమాండ్‌ ఉందో తెలుసుకుని అవి సాగుచేస్తే చాలు.. పత్తి, మిరప, కూరగాయలు ఇవి అందరూ సాగు చేస్తారు. వీటిని దాటి ఇంకో స్టెప్‌ ముందుకెయ్యాలి. గోధుమగడ్డి, నిమ్మగడ్డికి మార్కెట్‌లో డిమాండ్‌ భారీగా ఉంది. గోధుమగడ్డి జ్యూస్‌ తాగితే.. రక్తంతాగినట్లే.. రక్తహీనత ఉన్నవాళ్లకు ఇది నెంబర్‌వన్‌గా పనిచేస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే నిమ్మగడ్డి కూడా. నిమ్మగడ్డి నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. దీని నూనెకు మార్కెట్‌లో భలే గిరాకీ ఉంది. బ్యూటీ ప్రొడక్ట్స్, సబ్బులు, నూనె, మందుల తయారీలో నిమ్మ నూనె ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి(లెమన్ గ్రాస్) సాగు గురించి తెలుసుకుందాం.

లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ వర్గానికి చెందినది. ఎక్కువగా మెడికల్ రంగంలో ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి పంట పొడి వాతావరణం ఉండే ప్రాంతాలకు బాగా అనుకూలం. కరవు ప్రభావిత ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేయవచ్చు. ఈ పంటకు ఎరువులు, నీటి వినియోగం అంతగా అవసరం ఉండదు.

నిమ్మగడ్డి పంటకు హెక్టార్‌కు రూ.20 వేల కంటే తక్కువ పెట్టుబడితో సంవత్సరానికి రూ.4 నుంచి 5 లక్షల వరకు లాభాలను పొందవచ్చు. పంట వేసిన తరువాత వరుసగా 5-6 సంవత్సరాల పాటు స్థిరమైన దిగుబడి వస్తుంది. నిమ్మగడ్డి పెంపకానికి అదును కీలకం. ప్రధానంగా ఫిబ్రవరి నుంచి జులై నెల మధ్యలో ఈ పంట వేయవచ్చు. నర్సరీ పడకలు సిద్ధం చేయడానికి సరైన సమయం మార్చి నుంచి ఏప్రిల్ మధ్య అనువుగా ఉంటుంది.

ఒకసారి పంట వేస్తే ఏడాదికి ఆరు నుంచి ఏడు సార్లు కోతకు వస్తుంది. గడ్డి నుంచి సువాసన వస్తుంటే అది కోతకు వచ్చిందని అర్థం. నిమ్మగడ్డిని కోసిన తర్వాత దాని నుంచి నూనెను తీయాలి. నిమ్మగడ్డిని మార్కెట్‌లో విక్రయించవచ్చు. లేదా ఎండబెట్టిన తర్వాత పొడి చేసి అమ్ముకోవచ్చు. లేదంటే నూనె తీసే యంత్రాన్ని కొనుగోలు చేసి నిమ్మగడ్డి నుంచి నూనె తీయవచ్చు.

నిమ్మగడ్డి నూనె ఎంతో సువాసన వస్తుంది. హెక్టార్‌కు ఒక కోత ద్వారా నిమ్మగడ్డి నుంచి 3 నుంచి 5 లీటర్ల నూనెను ఉత్పత్తి చేసుకోవచ్చు. లీటరు ధర క్వాలిటీ ఆధారంగా మార్కెట్‌లో రూ.1,000 నుంచి రూ.1,500 మధ్య ఉంటుంది. మొదటి మూడేళ్లలో నిమ్మగడ్డి దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version