రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబుల భేటీపై CPI నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ మధ్య చర్చలు జరగడం శుభపరిణామం అన్నారు. పెండింగ్ లో ఉన్న విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అవసరమైతే సమస్యల పరిష్కారానికి ఇచ్చుపుచ్చుకునే ధోరణి వ్యవహరించాలని సూచించారు. ఈ చర్చల సందర్భంగా అన్ని విభజన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం వేళ కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. కాగా, గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు శనివారం భేటీ అయిన సంగతి తెలిసిందే హైదరాబాద్ లోని ప్రజా భవన్లో భేటీ అయిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు దాదాపు రెండు గంటల పాటు చర్చించి.. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని నిర్ణయించారు.