వాట్సాప్‌లో చీర‌లు అమ్ముతూ.. నెల‌కు ల‌క్ష‌లు సంపాదిస్తోన్న మ‌హిళ‌

-

సోష‌ల్ మీడియాను చెడుగా వాడుకుంటే ఎంత ప్ర‌మాద‌మో.. మంచిగా వాడుకుంటే అంత‌కు మించి మేలు చేస్తుంది. ఈ క్ర‌మంలోనే షణ్ముగప్రియ వాట్పాప్‌తో ఉపాధికి అనువైన మార్గాన్ని ఎంచుకుంది. మ‌రి కొంద‌రికి మార్గ‌ద‌ర్శ‌కంగా మారింది. నాలుగేళ్లలో దాదాపు మూడుకోట్ల రూపాయల టర్నోవర్‌ని ద‌క్కించుకుంది. షణ్ముగప్రియ చైన్నైలో నివ‌సిస్తుంది. ఈమెది చీర‌ల వ్యాపారం. ఆమె సంస్థ పేరు యునిక్‌ థ్రెడ్స్‌. 2014లో ప్రారంభించిన ఈ చీరల బిజినెస్‌కు ఆమె వాట్సప్ గ్రూప్‌నే కీలకంగా ఎంచుకుంది.

మొదట 20 మంది బంధుమిత్రులను ఓ గ్రూప్‌గా యాడ్‌ చేసింది. ఇప్పుడు వేలాదిమంది వినియోగదారులతో స్థానికంగానే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చీరలను ఆన్‌లైన్‌ ఆర్డర్ల మీద సరఫరా చేస్తోంది. రోజుకు దాదాపు 100 నుంచి 150 చీర‌లు ఆర్డర్ల మీద అమ్ముతుంది. అలాగే ఈమె నెల‌కు 22 లక్షల ఖరీదు చేసే చీరలను అమ్ముతుంది. అయితే షణ్ముగప్రియకు అత్త‌గారే స్పూర్తి. ఆమె ఇంటింటికి వెళ్లి చీరలు అమ్ముతూ ఉండేది. ప్రియ ఉద్యోగం చేస్తూ ఉంటే అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ఆమె చనిపోయారు. ఇక ఆమె ఉద్యోగం మానేసింది.

అయితే ఆమె కేవ‌లం త‌న భ‌ర్త ఆధాయంతో మాత్ర‌మే ఇల్లు గ‌డ‌వ‌ద‌ని అత్త‌గారి బాట‌లోనే చీర‌లు అమ్మ‌డం మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలోనే 20 మందితో వాట్సప్‌ గ్రూప్స్‌ స్టార్ట్‌ చేసింది. ఇల్లిల్లూ తిరగడంతో పాటు వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా వచ్చిన చీరల ఆర్డర్లు తీసుకునేది. దీంతో చీరల అమ్మకాల్లో వేగం పెరగడం గమనించింది. ప్రియ దగ్గర చీరల డిజైన్లు ప్రత్యేకతను ఇష్టపడిన కస్టమర్లు ఏటికేడాది పెరుగుతూ ఇప్పుడు మూడు కోట్ల విలువైన బిజినెస్‌ చేసేంతగా ఎదిగింది.

అదే విధంగా ఆమె భ‌ర్త కూడా ఉద్యోగం మానేసి ఆమెకు అండ‌గా నిలిచారు. ప్ర‌స్తుతం ప్రియ 11 వాట్సప్‌ గ్రూప్‌లను నిర్వహిస్తోంది. టెలిగ్రామ్‌నూ ఉపయోగిస్తోంది. ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో చీరలను మార్కెట్‌ చేసేందుకు ఎనిమిది మందిని ఏర్పాటుచేసుకుంది. తన ఇంటి మొదటి అంతస్తులో గోడౌన్‌ కమ్‌ షాప్‌ను ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన ఆర్డర్‌ చీరలు ఇక్కడే ప్యాకింగ్‌ అవుతాయి. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్యాకేజీలు బయటకు వెళ్తాయి. వేర్వేరు కొరియర్‌ కంపెనీల ద్వారా కస్టమర్లకు చీరలను అందిస్తుంటుంది షణ్ముగప్రియ. ఇలా ఎంద‌రో మ‌హిళ‌ల‌కు ఆమె స్పూర్తిగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version