వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు..!

-

తిరుమల వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులుతో సమీక్షా నిర్వహించారు అదనపు ఇఓ వెంకయ్య చౌదరి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయనున్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు.

చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు కానున్నాయి. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. ఇక వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేసారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు చర్యలు మొదలుపెట్టారు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version