ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం బాగా తగ్గుతోంది. ముఖ్యంగా జనాలు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పేపర్‌తో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ బ్యాగులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆ తరహా ఉత్పత్తులను ఎక్కువగా వాడాలని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. దీంతో పేపర్ బ్యాగుల వినియోగం ఎక్కువైంది. అయితే ఆ బ్యాగులను తయారు చేసే బిజినెస్ పెట్టుకుంటే.. ఎవరైనా సరే.. చక్కని ఉపాధి పొందవచ్చు. దీనికి మార్కెటింగ్ కూడా చాలా సులభంగా చేయవచ్చు. అలాగే లాభాలను కూడా అధికంగా పొందవచ్చు. మరి ఈ వ్యాపారానికి ఏమేం అవసరం అవుతాయో.. ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఎంత వరకు లాభాలు వస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగులను రెండు రకాలుగా తయారు చేయవచ్చు. ఒకటి హ్యాండ్ మేడ్.. రెండోది మెషిన్ మేడ్.. హ్యాండ్ మేడ్ విధానంలో మ్యాన్ పవర్, ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఉత్పత్తి తక్కువగా వస్తుంది. అదే మెషిన్లతో అయితే మ్యాన్ పవర్ తక్కువ అవసరం అవుతుంది. ఖర్చు తక్కువ ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. దీంతో లాభాలను ఆర్జించవచ్చు. పేపర్ బ్యాగులను తయారు చేసేందుకు భిన్న రకాల మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. క్రీజింగ్ మెషిన్, గ్లూయింగ్ మెషిన్, వి-క్రీజింగ్ గ్లూయింగ్ మెషిన్, హ్యాండిల్ గ్లూయింగ్ మెషిన్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మార్కెట్‌లో వీటి ధర రూ.2 లక్షల వరకు ఉంది. ఇక బ్యాగుల తయారీకి 100 జీఎస్ఎం క్రాఫ్ట్ పేపర్‌ను కొనాలి. దీని ధర 1 కిలోకు రూ.30గా ఉంటుంది.
ఇక 1కిలో క్రాఫ్ట్ పేపర్‌తో 150 బ్యాగుల వరకు తయారు చేయవచ్చు. అందుకు గాను రూ.60 ఖర్చు అవుతుంది. వీటిని ఒక బ్యాగు వెల రూ.1 చొప్పున 150 బ్యాగులను రూ.150 కు అమ్మవచ్చు. దీంతో రూ.150 లోంచి ఖర్చు రూ.60 తీసేస్తే.. రూ.90 లాభం వస్తుంది. ఈ క్రమంలో నిత్యం 100 కేజీల పేపర్‌తో ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగులను మెషిన్ల ద్వారా తయారు చేయవచ్చు. దీంతో 100 * 90 = రూ.9వేలు రోజుకు వస్తాయి. నెలకు ఈ మొత్తం రూ.2,70,000 అవుతుంది. ఇందులో రూ.70వేలను కరెంటు ఖర్చులు, జీతాలు, ఇతర వ్యయాల కింద తీసేసినా.. రూ.2 లక్షలను లాభం రూపంలో నెల నెలా సంపాదించవచ్చు.
అయితే మార్కెట్‌లో ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటిని సులభంగా మార్కెటింగ్ చేయవచ్చు. సూపర్ మార్కెట్లు, ఇతర దుకాణాలకు వీటిని సప్లయి చేయవచ్చు. అలాగే హోల్‌సేల్ వ్యాపారులతో కాంట్రాక్టు కుదుర్చుకుంటే.. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. దీంతో నెల నెలా ఈ వ్యాపారంలో లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది..!