చేపలు, చికెన్ లాగే కౌజు పిట్టల మాంసంలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ మాంసం రుచిగా కూడా ఉంటుంది. అందుకనే ప్రస్తుతం కౌజు పిట్టల మాంసానికి కూడా అధికంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో కౌజు పిట్టలను పెంచి వాటి మాంసాన్ని, గుడ్లను విక్రయిస్తూ అనేక మంది లాభాలను గడిస్తున్నారు. మరి ఈ బిజినెస్ ఎలా ఏయాలి..? ఇందులో ఏ మేర సంపాదించవచ్చు..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
కౌజు పిట్టలను పెంచేందుకు తక్కువ స్థలం సరిపోతుంది. పెట్టుబడి కూడా తక్కువగానే అవుతుంది. ఇక వీటిని తిత్తిరి పిట్ట, అడవి పూరేడు పిట్ట, అడవి పూరి పిట్ట.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. వీటిని 10 * 10 లేదా 10 * 20 సైజు ఉన్న రూమ్‌లలో లేదా కేజ్‌లలో పెంచవచ్చు. ఒక్కో పక్షికి 0.1 నుంచి 0.2 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది. అంటే.. 100 పక్షులను పెంచాలంటే.. 10 చదరపు అడుగుల స్థలం చాలన్నమాట. ఇక కౌజు పిట్టలను పెంచేందుకు ప్రత్యేకంగా ఎలాంటి పరిజ్ఞానం అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం ఎక్కువ లభిస్తుంది కనుక అక్కడ ఎక్కువ మొత్తంలో వీటిని పెంచితే అధికంగా లాభాలు సంపాదించవచ్చు.
కౌజు పిట్టలకు కోళ్లకు పెట్టే బ్రాయిలర్ దాణాను వేయవచ్చు. దీంతో అవి బాగా పెరుగుతాయి. ఇక ఈ పిట్టలకు కోళ్లకు వచ్చే మశూచి, కొక్కెర వ్యాధులు వీటికి రావు. ఆ వ్యాధులు రాకుండా వీటికి బలమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఎలాంటి టీకాలు వేయించాల్సిన అవసరం లేదు. అయితే కౌజు పిట్టలను పెంచే పరిసరాలతోపాటు వాటికి అందించే దాణా, నీరు పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే విరేచనాలు, శ్వాస వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అవి తప్ప వీటికి దాదాపుగా ఇతర ఏ వ్యాధులూ రావు.
ఇక కౌజు పిట్టలు 4 నుంచి 5 వారాల్లో 200 నుంచి 250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. 4 వారాల తరువాత 200 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్టలను అమ్మవచ్చు. ఇక ఒక్కో పిట్ట 4 వారాల్లో 500 గ్రాముల వరకు దాణా తింటుంది. ఈ క్రమంలో దాణాకు రూ.15 వరకు ఒక్క పిట్టకు అవుతుంది. అలాగే ఒక్క పిట్టను పెంచేందుకు రూ.26 వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలో హోల్‌సేల్ వ్యాపారులకు ఒక్క పిట్టను రూ.50 నుంచి అమ్మవచ్చు. దీంతో ఒక్కో పిట్టపై రూ.24 లాభం వస్తుంది. ఇక 4 వారాల్లోనే.. అంటే.. నెల రోజుల్లోనే ఒక బ్యాచ్ వస్తుంది కనుక.. ఒక బ్యాచ్‌కు 100 కౌజు పిట్టలు అనుకుంటే.. వాటిని అమ్మితే 100 * 24 = రూ.2400 వస్తాయి. అయితే వాటి గుడ్ల ఖరీదు కూడా దాదాపుగా కోడిగుడ్ల ఖరీదు అంతే ఉంటుంది కనుక.. వాటిని కూడా అమ్మి ఆ మేర లాభాలను పొందవచ్చు.
అయితే ఒక బ్యాచ్ కౌజు పిట్టలను అమ్మాక.. గదిని వారం పాటు ఖాళీ ఉంచి మళ్లీ బ్యాచ్ మొదలు పెట్టాలి. అయితే వారం వారం 100 కౌజు పిట్టలను అమ్మాలంటే.. ఒక్కో గదిలో ఒక్కో బ్యాచ్‌ను ఒక్కో వారం మొదలు పెట్టాలి. దీంతో ఒక వారం ఒక బ్యాచ్, మరొక వారం మరొక బ్యాచ్‌ను విక్రయించవచ్చు. దీంతో నెలకు 4 బ్యాచ్‌లు వస్తాయి. ఒక్కో బ్యాచ్‌లో 100 పక్షులు కాకుండా 500 పక్షులను పెంచితే.. 4 * 500 = 2000 పక్షులను పెంచవచ్చు. ఈ క్రమంలో 2000 * 24 = రూ.48,000 నెలకు వస్తాయి. ఇలా నెల నెలా కౌజు పిట్టలను విక్రయించడం ద్వారా చక్కని ఆదాయం పొందవచ్చు. ఇక దీనికి గుడ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలిపితే అది ఇంకా ఎక్కువే అవుతుంది.
ఇక కౌజు పిట్టలను పెంచడానికి ముందుగా మార్కెట్‌ను ఒకసారి పరిశీలించాలి. వీటి గుడ్లకు, మాంసానికి ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. ఆ తరువాతే వీటిని పెంచాలి. ప్రస్తుతం రెండు, తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీటి మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉంది. కనుక కౌజు పిట్టల మాంసాన్ని అమ్మి లాభాలను పొందవచ్చు. అయితే గుడ్ల కోసం వీటిని పెంచితే.. కాల్షియం ఎక్కువగా ఉండే దాణాను అందించాలి. దీంతో ఒక పిట్ట 5 నుంచి 6 వారాల్లో గుడ్లు పెడుతుంది. ఈ క్రమంలో ఒక పిట్ట ద్వారా 10 నెలల కాలంలో సుమారుగా 200 గుడ్ల వరకు వస్తాయి. ఇక గుడ్లను అమ్మకుండ బ్రీడర్స్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అందుకు వాటిని 17 రోజుల పాటు పొదిగించాలి.
కౌజు పిట్టలను పెంచే బిజినెస్ ప్రారంభించాలనుకుంటే నాణ్యమౌన కౌజు పిల్లలను తేవాలి. ఆదరణ ఉన్న హ్యాచరీలు అయితే రశీదు కూడా ఇస్తారు. అందువల్ల అక్కడ నాణ్యమైన కౌజు పిల్లలను కొనుగోలు చేయవచ్చు. ఇక హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాలలోనూ నాణ్యమైన కౌజు పిల్లలను అందిస్తారు. కానీ వాటి కోసం 2 నెలలు ముందుగా బుకింగ్ చేసుకోవాలి. అయితే ఒక్కోసారి అంతకు మించి కూడా ఆగాల్సి వస్తుంది. కానీ వెయిట్ చేసినా.. నాణ్యమైన కౌజు పిల్లలను పొందవచ్చు.
ఇక చికెన్ కన్నా కౌజు పిట్టల మాంసంలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీని మాంసాన్ని చిన్నారులు, వృద్ధులు కూడా తిని సులభంగా జీర్ణం చేసుకోవచ్చు. అందువల్ల కౌజు పిట్టల మాంసానికి ఇప్పుడిప్పుడే మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పిట్టలతో ఈ బిజినెస్ చేయవద్దు. ముందుగా 100 నుంచి 200 పక్షులతో మొదలు పెట్టి మార్కెట్‌లో ఎక్కువ రోజుల పాటు ఉండే ప్రయత్నం చేస్తే.. నెమ్మదిగా అనతికాలంలోనే ఎక్కువ కౌజు పిట్టలను పెంచి విక్రయించవచ్చు. దీంతో తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయి. ఇక బిజినెస్‌కు మంచి బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తే.. వినియోగదారులకే నేరుగా మీరు విక్రయించవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది..!!