ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఏడాది జరగనున్న ఈ వేడుకకు సంబంధించి 96వ అకాడమీ అవార్డున నామినేషన్లను తాజాగా ప్రకటించారు. ఆస్కార్ అకాడమీ భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ జాబితాను వెల్లడించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకుడు.. ఇలా ఇరవై మూడు విభాగాల్లో 120కి పైగా చిత్రాలు, డాక్యుమెంటరీలకు సంబంధించిన నామినేషన్లు ప్రకటించారు. మార్చి 10(భారత కాలమానం ప్రకారం మార్చి 11)న ఆస్కార్ తుది విజేతలెవరో తేలిపోనుంది.
ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల్లో అమెరికన్ ఫిక్షన్, ఎనాటమీ ఆఫ్ ఎ ఫాల్, బార్బీ, ది హోల్డోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మేస్ట్రో, ఓఫెన్హైమర్, పాస్ట్ లైవ్స్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ చిత్రం నామినేషన్ దక్కించుకున్నాయి. ఇందులో ‘ఓపెన్‌హైమర్’, ‘ది పూర్ థింగ్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ‘బార్బీ’ చిత్రాలకు అత్యధిక నామినేషన్లు వచ్చాయి.