తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్ స్టార్- నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. వారిని జూన్ 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు పోలీసుల విచారణలో పవిత్రా గౌడకు అశ్లీల చిత్రాలు పంపించడంతో కోపంతో తాను రేణుకా స్వామిపై చేయి చేసుకున్నానంటూ విచారణ చేస్తున్న పోలీసులకు దర్శన్ వివరించాడు.
రేణుకా స్వామిని తాను రెండు దెబ్బలు కొట్టి, షెడ్డు నుంచి బయటకు వచ్చానని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి, తన తలకు చుట్టారని దర్శన్ పోలీసుల ఎదుట వాపోయాడు. అతన్ని తీసుకువచ్చేంత వరకు తనకు ఆ విషయం తెలియదని.. అతన్ని బెంగళూరుకు తీసుకువచ్చామని చెప్పి షెడ్డుకు తీసుకువెళ్లారని చెప్పాడు. అతనితో పవిత్రా గౌడకు క్షమాపణలు చెప్పిద్దామని మాత్రమే వెళ్లానని.. తనను, పవిత్రను చూసిన వెంటనే తప్పయిందని.. చేతులు జోడించాడని తెలిపాడు. రెండు దెబ్బలు వేసి.. జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి, భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి, ఇంటికి వచ్చేశానని పోలీసులకు దర్శన్ తెలిపాడు.