అఖిల్ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. సాక్షి వైద్య అఖిల్‌కు జంటగా ఈ చిత్రంలో నటించింది. గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు వారాలకే సినిమాను ఓటీటీ విడుదల చేస్తున్నట్లు స్ట్రీమింగ్ వేదిక సోనీ లివ్ తెలిపింది. మే 19వ తేదీ (నుంచి ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, సినిమా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఓటీటీలో సినిమా చూద్దామనుకునే వారు నిరాశకు గురయ్యారు.
ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా యూజర్లు సోనీ లివ్‌ను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం సినిమా అందుబాటులో లేదు. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌ల కోసం దయ చేసి మా సోషల్‌మీడియా వేదికలను అనుసరించండి’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఏజెంట్ పోస్టర్‌లను పంచుకుంటూ ‘‘అఖిల్, మమ్ముటి నటించిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ రైడ్ ‘ఏజెంట్’ త్వరలోనే స్ట్రీమింగ్ అవుతుంది’’ అని పేర్కొంది. అయితే, ఎప్పుడు, ఏ సమయానికి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొస్తారో మాత్రం చెప్పలేదు.