‘ఆదిపురుష్’ మేకర్స్‌కు అలహాబాద్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. జులై 27న చిత్రబృందం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కూమార్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతషిర్ను కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు సూచించింది.
కుల్దీప్ తివారీ, నవీన్ ధావన్ వేసిన వేర్వేరు పిటిషన్లను.. జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాష్ సింగ్‌తో కూడిన ఓ వెకేషన్ బెంచ్ విచారించింది. ఈ క్రమంలో సినిమా ప్రసారం కోసం సినిమా సర్టిఫికేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించారా లేదా అనే విషయానికి వివరణ ఇచ్చేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చైర్మన్‌లు తమ వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని బెంచ్ ఆదేశించింది. ‘ఆదిపురుష్’ దర్శకుడు, రచయిత అలాగే నిర్మాతలు.. విచారణ తేదీలోగా వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్లు వచ్చే వరకు చిత్రబృందం సభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది.