గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. అల్లరి నరేష్ ఆర్థిక సాయం

-

కరోనా కష్టకాలం సినీ కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్ పెద్దలందరూ కదిలి వస్తున్నారు. దినసరి కూలీలు, రెక్కాడితే గానీ డొక్కాడని సినీ శ్రామికులకు అండగా నిలబడేందుకు చిత్ర సీమ కదిలింది. ఇది వరకే వివి వినాయక్ వంటి వారు ఐదు లక్షలతో అందరికీ నిత్యవసర సరుకులను అందించే కార్యక్రమం మొదలుపెట్టారు. కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నాడు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం పేద కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. సినీ కార్మికులకు ఉపయోగపడే విధంగా కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించాడు. అంతకుముందు డైరెక్టర్ వివి వినాయక్ సైతం ఐదు లక్షలను అందజేశాడు. నిత్యావసర సరుకులు కావాల్సిన వారు కాదంబరి కిరణ్‌ను సంప్రదించండని వీడియో సందేశాన్ని రిలీజ్ చేశాడు. తాజాగా అల్లరి నరేష్ సైతం తనకు చేతనైనా సాయాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ‘మనిషిగా కష్టం వచ్చినప్పుడు.. అందరం అందరి కోసం నిలబడలేకపోవచ్చు.. కానీ ప్రతీ ఒక్కరూ పక్కవారి కోసం ఎంతో కొంత చెయ్యగలం.. కోవిడ్ 19 నివారణ కోసం జరిగే ఈ 21 రోజుల లాక్ డౌన్ వల్ల.. మా నాంది యూనిట్‌లో రోజూ వారి వేతనంతో జీవనం సాగించే వారి 50 మందికిపైగా ఉన్న మా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా వుండాలని, మా యూనిట్ తరుపున నేను.. మా నిర్మాత సతీష్ వేగేశ్న కలిసి.. ప్రతీ ఒక్కరికీ తలా పది వేల రూపాయలు సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి.. మరిన్ని సాయాలకు ‘నాంది’’ అంటూ తెలిపాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version