Aryan Khan: డ్రగ్స్ కేసులో దాదాపు 26 రోజుల జైలు జీవితం తరువాత.. ఆర్యన్ ఖాన్ శనివారం బెయిల్ పై జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఆర్యన్ తో పాటు ఆయన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్మున్ ధమేచా కూడా ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. వీరికి గురువారం బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఆ బెయిల్ కు సంబంధించిన ఆదేశాలను శుక్రవారం జారీచేసింది కోర్టు. ఈ ఆదేశాలలో 14 షరతులను విధిస్తూ బెయిల్ మంజూర్ చేశారు.
ఈ షరతుల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా.. బెయిల్ రద్దవుతుందని స్సష్టం చేసింది బాంబే హైకోర్టు . ఈ క్రమంలో బెయిల్ కోసం ష్యూరిటీగా రూ.లక్ష బాండ్ తో పాటు ఒకరి హామీని కూడా తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ న్యాయవాది సతీష్ మనేషిండే వాదించగా, నటి జుహీ చావ్లా ఆర్యన్‌కు ష్యూరిటీ ఇచ్చారు.
ఆ షరతులివే..
1. కోర్టు ఆదేశాల మేరకు నిందితులు రూ.లక్ష పీఆర్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెక్యూరిటీ డిపాజిట్లతో సమర్పించవచ్చు.
2. నిందితులపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద నమోదైన కేసు లాంటి కార్యకలాపాలకు, దానికి సమానమైన కార్యకలాపాలలో పాల్గొనకూడదు.
3. నిందితుల్లో ఎవరూ తమ సహ నిందితులతో మాట్లాడే ప్రయత్నం చేయరాదు. డ్రగ్స్ సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమేయం ఉన్న ఎవరినీ సంప్రదించరాదు
4.నిందితుడు ప్రత్యేక న్యాయస్థానం విచారణకు విఘాతం కలిగించే ఏ పనీ చేయకూడదు.
5. నిందితుడు వ్యక్తిగతంగా లేదా ఏ విధంగానూ సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను
తారుమారు చేయడానికి ప్రయత్నించకూడదు.
6. నిందితులు తమ పాస్‌పోర్టులను వెంటనే ప్రత్యేక కోర్టుకు సమర్పించాలి.
7. కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించరాదు.
8. నిందితుడు ఏ మీడియాలోనూ ఎలాంటి ప్రకటన చేయకూడదు.
9. ముంబయి దాటి బయటకు వెళ్లాలన్నా దర్యాప్తు అధికారికి తమ ప్రయాణ వివరాలు తెలపాల్సి ఉంటుంది.
10. నిందితులు ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎన్‌సీబీ ముంబై కార్యాలయంలో హాజరుకావాలి.
11. ఎన్‌సీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా నిందితులు ఎన్‌సీబీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
12. ఏదైనా న్యాయమైన కారణం ఉంటే తప్ప విచారణకు గైర్హాజరు కావడానికి వీల్లేదు.
13. విచారణ ప్రారంభమైన తరువాత నిందితులు ఏ రకంగాను జాప్యానికి కారణం కారాదు.
14. నిందితుడు ఈ షరతుల్లో దేనినైనా ఉల్లంఘిస్తే వారి బెయిల్ రద్దు చేయాలని కోర్టును నేరుగా కోరే అధికారం ఎన్‌సీబీ అధికారులు ఉంటుంది.