బిగ్బాస్ ఫైనల్స్ రోజున విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్దీప్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. పరస్పరంగా గొడవకు దిగడమే కాకుండా అక్కడున్న పలువురి వాహనాలు ధ్వంసం చేశారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగులగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో వాహనాల ధ్వంసం, దాడి ఘటనలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా(ఏ1) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చిన పోలీసులు ఏ-2గా అతని సోదరుడు మనోహర్‌ను, ఏ-3గా అతని స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. ఏ-4గా మరో ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. రెండు కార్లను సీజ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. బిగ్‌బాస్ తుది పోటీల నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగినదాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు.
పల్లవి ప్రశాంత్ తప్పు చేస్తే పోలీసులు ఆధారాలతో సహా కేసు నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది రాజేష్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా అతడి తరఫు న్యాయవాది ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు.