తలపడనున్న ప్రభాస్​ – హృతిక్.. ఇక ఫ్యాన్స్​కు పూనకాలే.. బాక్స్​ఆఫీస్​ బద్దలే​

-

బాక్సాఫీస్ ముందు ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడితే ఆ మజానే వేరు. అదే ఆ ఇద్దరు కథానాయకులు బీభత్సo సృష్టించే యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలతో వస్తే బాక్స్ ఆఫీస్ ఫై ఇక దండయాత్రే. ఇప్పుడు అలాంటి భారీ కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్- బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.

అసలు విషయం ఏంటంటే.. ‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్. ఈ మూవీ అనంతరం ప్రభాస్ నుంచి సాహో, రాధే శ్యాం వంటి చిత్రాలు వచ్చిన అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా అతడు నటిస్తున్న చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ సలార్ విడుదల తేదీని ప్రకటించారు.

సలార్​

ఆగస్టు 14న విడుదలైన ఈ పోస్టర్‌ ప్రభాస్‌ అభిమానులకు భారీ కిక్కే ఇచ్చింది. రెండు కత్తులతో నిలబడి ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ థ్రిల్లయ్యారు. 2023 సెప్టెంబరు 28న సలార్‌ని విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఇదే రోజున మరో భారీ సినిమాను విడుదల చేస్తామని సలార్‌ కంటే ముందే ప్రకటించారు. అదే హృతిక్‌ రోషన్‌ భారీ యాక్షన్‌ చిత్రం ఫైటర్‌. భారతదేశపు మొట్టమొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైటర్​లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనీల్‌ కపూర్, కొందరు హాలీవుడ్‌ నటులు ఈ సినిమాలో నటించనున్నారు. వయాకాం స్టూడియోస్‌తో కలసి సిద్దార్థ్ ఆనంద్ నిర్మిస్తున్నాడు.

ఫైటర్​

”ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. భారతీయ సైనిక వీరత్వాన్ని చాటి చెప్పే విధంగా, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని తీస్తా” అని ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్‌ ప్రకటించారు. హృతిక్‌తో బ్యాంగ్‌ బ్యాంగ్‌, వార్‌ లాంటి విజయవంతమైన సినిమాలను సిద్ధార్థ్‌ ప్రేక్షకులకు అందించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కొన్ని నెలల క్రితం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది(2023) సెప్టెంబరు నెలాఖరున విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు ‘సలార్‌’ తేది కూడా ప్రకటించడంతో ఈ రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు ఇండియన్‌ బాక్సాఫీస్‌ వేదికగా ఢీ కొంటాయా! అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఏర్పడింది.

హృతిక్ ఫైటర్

ప్రస్తుతం సలార్‌ బడ్జెట్ రూ.200 కోట్లు కాగా, ఫైటర్‌ బడ్జెట్‌ రూ.250కోట్లు. ఫైటర్‌ బడ్జెట్‌ పెరిగే అవకాశం ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తామని ఆ చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి కనీసం పోస్టర్‌ని ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఫైటర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభమవ్వనుంది. ఈ నేపథ్యంలో ఏ సినిమాకి ఏ సినిమా దారిస్తుందో! ఏది స్క్రీన్‌పై భారీగా నిలబడుతుందో! అని సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నార్త్ వర్సెస్ సౌత్ అనే అంశంపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్న సందర్భంలో ఒకే రోజు బాలీవుడ్, సౌత్ సినిమాలు విడుదల కావడం చెప్పుకోదగ్గ విశేషమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version