నాగ్‌ – త్రివిక్రమ్‌…. ఏంటీ గొడవ.?

-

కింగ్‌ నాగార్జున, దర్శకుడు త్రివిక్రమ్‌… వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా లేదు. కానీ త్రివిక్రమ్‌ మాటల రచయితగా మాత్రం ఒక సినిమా ఉంది. అది ‘మన్మథుడు’. కానీ, ఆ సినిమాలో ఉన్న పంచ్‌ డైలాగ్‌ల క్రెడిట్‌ త్రివిక్రమ్‌కు ఇవ్వకుండా, దర్శకుడు విజయభాస్కర్‌కు ఇచ్చాడు నాగార్జున. వీరిద్దరి మధ్య అసలేం జరిగింది?

‘మన్మథుడు’… 2002లో విడుదలైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అద్భుతమైన కామెడీ, పసందైన పంచ్‌ డైలాగులు, సూపర్‌ మ్యూజిక్‌.. ఇలా అన్నీ కలిసి ఆ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ చేసాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది విజయభాస్కర్‌. మాటలు త్రివిక్రమ్‌. సంగీతం దేవిశ్రీప్రసాద్‌. విజయభాస్కర్‌ అనే దర్శకుడు చేసింది మొత్తం 12 సినిమాలు. అందులో ఆరింటికి మాటలు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. మిగిలినవాటికి వేరే అతను మాటలు రాసాడు. ఈ పన్నెండింటిలో ఐదు సూపర్‌హిట్లు కాగా, మిగిలినవి అట్టర్‌ఫ్లాప్‌లు. హిట్టయిన ఐదింటికి కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్‌, 2002లో ‘నువ్వే-నువ్వే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన మార్కు పంచ్‌లతో, కామెడీతో ఆ సినిమాను కూడా చక్కగా పండించాడు. ఇక తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో తీసిన ‘అతడు’ త్రివిక్రమ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇక వెనక్కితిరిగి చూసుకునే అవసరం లేకుండా చేసింది. కథల్లో నవ్యత్వం, మంచి సంగీతం, హాలివుడ్‌ స్థాయి కెమెరా పనితనం, కామెడీ టైమింగ్‌, సరిపోయే తారలు.. ఇలా ఎంచుకుని మరీ చిత్రాలను రూపొందించే  ఈ మాటల మాంత్రికుడి దర్శకత్వంలో నటించాలని ప్రతీ హీరో కోరుకునే స్థాయికి వెళ్లిపోయాడు. ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న నలుగురైదుగురు టాప్‌ డైరక్టర్లతో అతను ఒకడు.

ఇక అసలు విషయానికొస్తే, మొన్నీమధ్య, నాగార్జున తన తాజా చిత్రం ‘మన్మథుడు-2’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ, మన్మథుడు (1), తన కెరీర్‌లో గొప్ప సినిమా అని, అందులోని కామెడీ ట్రాక్‌లు, పంచ్‌ డైలాగులు తనకు బాగా నచ్చాయని తెలిపాడు. అందుకు ఆ చిత్ర దర్శకుడు విజయభాస్కర్‌ను అభినందించాలి అని అనగానే, అందరూ షాక్‌..! అసలు ఆ సినిమా క్రెడిటంతా త్రివిక్రమ్‌దే అని ఇండస్ట్రీ, ప్రేక్షకులు, ఆఖరుకు నాగార్జునకు కూడా తెలుసు. కానీ, ఆయన ప్రసక్తే లేకుండా మాట్లాడాడు నాగ్‌. ఇదే టాపిక్‌ను నిన్నటి ప్రెస్‌మీట్‌లో విలేకరులు తీసి, ఆ సినిమాకు మాటలు త్రివిక్రమ్‌ కదా.. అలా ఎలా మాట్లాడారు.? అంటే, నాకు కథ చెప్పింది విజయభాస్కర్‌. అందులో ఉన్న పంచ్‌లు రోజూ నాకు చెప్పింది ఆయనే. అందుకే ఆయన పేరు చెప్పాను అని అన్నాడు. మరి నిజానికి మాటలు రాసింది త్రివిక్రమ్‌ కదా.. అంటే, సమాధానం చెప్పకుండా, నెక్స్ట్‌ క్వశ్చన్‌ ప్లీజ్‌..! అన్నాడు. అంతే… అప్పుడు మొదలైన గుసగుసలు ఇంకా ఆగలేదు.

నాగార్జున, త్రివిక్రమ్‌ పట్ల అంత శత్రుత్వం ఎందుకు పెంచుకున్నట్లో ఎవరికీ అర్థం కాలేదు. ఇక అందరూ ఈ కొత్త అన్వేషణ మొదలుపెట్టారు. తీరా అసలు విషయమేమిటంటే, తన చిన్న కొడుకు అఖిల్‌ను తన దర్శకత్వంలో లాంచ్‌ చేయాలని నాగార్జున త్రివిక్రమ్‌ను కోరినట్లు, తన కమిట్‌మెంట్లు అప్పుడే పూర్తి కానందున, ఈ ప్రపోజల్‌ను త్రివిక్రమ్‌ తిరస్కరించినట్లుగా తెలిసింది. దానికి పాపం… నాగ్‌ చాలా తీవ్రంగా హర్ట్‌ అయ్యాడట. తనంతటి వాడు అడిగితే చేయకపోవడం అనే పాయింట్, ఈగో క్లాష్‌కు దారితీసినట్టుగా ఫిలింనగర్‌ వర్గాలు ఎట్టకేలకు చేధించిన రహస్యం.

ప్రస్తుతానికి వస్తే, ఖర్మ కాలిపోయి, మన్మథుడు-2’ ఘోరమైన టాక్‌ తెచ్చుకోవడమే కాకుండా, మంచి హిట్‌ టైటిల్‌ గౌరవాన్ని నాశనం చేసారని బూతులు తిడుతున్నారు జనం. ఈ వయసులో ఆ పైత్యపు చేష్టలేమిటని, నిజజీవితంలో హీరోయిన్ల పాలిటి మన్మథుడే అయినా, కొంచెం వయసును కూడా గుర్తుంచుకుంటే మంచిదని ప్రేక్షకులు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా తను పదహారేళ్ల బాలాకుమారుడిననే భ్రమల్లో బతికేస్తుంటే, ప్రేక్షకులు మాత్రం ఇంట్లోనే కూర్చోబెట్టే ప్రమాదముంది మరి.

రుద్రప్రతాప్‌

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version