ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలైన రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిత్రం విడుదలై దాదాపు 15 రోజులు దాటినా ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇక రికార్డుల్లో ఈ చిత్రం మామూలుగా దూసుకెళ్లడం లేదు. ఇటీవల రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన కల్కి.. తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది.
‘బుక్‌మైషో’లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా నిలిచింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడయ్యాయట. ఇప్పటివరకూ ఉన్న షారుక్ ఖాన్ ‘జవాన్’ రికార్డును (12.01 మిలియన్ టికెట్లు) ‘కల్కి’ అధిగమించినట్టైంది.
నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ జూన్ 27వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ లాంటి ప్రముఖ నటుల కీలక పాత్రలు, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి యంగ్ హీరోల అతిథి పాత్రలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముందునుంచీ భైరవగా సందడి చేసిన ప్రభాస్.. చివరిలో కర్ణుడిగా కనిపించి ‘పార్ట్ 2’పై అంచనాలు పెంచేశాడు.