దర్శన్‌పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?

-

కన్నడ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తాజాగా ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ స్పందించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మీడియా ఏం చూపిస్తుందో తమకు అదే తెలుసని అన్నారు. తాము పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారం తెలుసుకోవడం లేదని తెలిపారు.

నిజాలను వెలికితీసేందుకు మీడియా, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తోందని సుదీప్ వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి న్యాయం దక్కాలని పోలీసులను కోరారు. మృతుడి భార్య, ఇంకా భూమ్మీదకు రాని ఆ బిడ్డకు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు కన్నడ సినీ పరిశ్రమను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టిందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది త్వరగా ఒక కొలిక్కి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగం ఒకరిద్దరికి చెందినదని కాదని, ఇండస్ట్రీకి క్లీన్‌ చిట్ లభించాలని కిచ్చా సుదీప్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version