రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. స్టూడియో కోసం తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ వెంచర్ కింద మార్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు దగ్గుబాటి సురేష్ బాబు. సురేష్ ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో స్వయంగా సురేష్ బాబు అప్లై చేసినట్లు సమాచారం అందుతోంది. మధురవాడ సర్వే నంబర్ 397/Pలో రామానాయుడు స్టూడియోలో భాగంగా ఉన్న ఎకరాలను లేఅవుట్ కింద మార్చేందుకు అనుమతి ఇచ్చారు అప్పటి జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు.
జగన్ సీఎంగా ఉన్న సమయంలో మార్చి 2, 2023న అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 30 ఎకరాలు రామానాయుడు స్టూడియో నిర్మాణానికి కేటాయిస్తూ జీవో జారీ అయింది. ఎకరా 5 లక్షల చొప్పున 2009లో అతి తక్కువ రేటుకు భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అదే భూమిలో 15 ఎకరాల్లో భారీ విల్లాలు నిర్మించి అమ్మాలనేది సురేష్ బాబు ప్లాన్ వేశారని అంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పటికే సురేష్ బాబుకి నోటీసులు జారీ అయ్యాయి.