అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొరడా ఝులిపించింది. ఇప్పటికే నటీనటుల విషయంలో ఎలాంటి దుష్ప్రచారాలను సహించేది లేదంటూ పలు సందర్భాలలో ప్రకటిస్తూ వచ్చిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ తాజాగా తెలుగు సినీ నటుల మీద అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తూ నటీనటుల అసభ్యకర వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్న ఐదు యూట్యూబ్ ఛానల్స్ ను సైబర్ క్రైమ్ ఆధారంగా తొలగించారు. నటీనటుల మీద అసభ్యకర వ్యాఖ్యలు, నటీనటుల కుటుంబాల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసే ఐదు యూట్యూబ్ ఛానల్స్ ని ముందుగా తొలగించారు.
అంతేకాదు.. నటీనటుల మీద పర్సనల్ అటాక్స్ కి కూడా ఈ ఐదు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు దిగినట్లుగా గుర్తించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే మా దగ్గర ఉన్న లిస్ట్ ని అప్డేట్ చేస్తూ వెళ్తాము అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ ట్విట్టర్ అకౌంట్ వేదికగా ప్రకటించింది. ప్రస్తుతానికి ఐదు యూట్యూబ్ ఛానల్స్ లను టెర్మినేట్ చేసినట్లుగా వెల్లడిస్తూ వాటి పేర్లను కూడా మెన్షన్ చేశారు. జస్ట్ వాచ్ bbc, ట్రోల్స్ రాజా, బాచిన లలిత్, హైదరాబాద్ కుర్రాడు ఎక్స్ వై జెడ్ ఎడిట్స్ 007 అనే యూట్యూబ్ ఛానల్స్ లను ప్రస్తుతానికి తొలగించారు