96వ ఆస్కార్‌ వేడుకలకు ‘గాజా’ నిరసనల సెగ

-

అమెరికా లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ వేడుకలకు గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల సెగ తగిలింది. ఆందోళనకారులు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలువురు ప్రముఖులు కార్యక్రమానికి ఆలస్యంగా హాజరయ్యారు.

వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు మద్దతుగా నిలవాలని అక్కడికి వచ్చే ప్రముఖులను కోరారు. నిరసనలపై ముందే సమాచారం ఉన్న లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల చుట్టుపక్క ప్రాంతాలను క్షుణ్నంగా తనిఖీ చేసి గస్తీ ఉంచారు. మరోవైపు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డు అందుకున్న బిల్లీ ఇలిష్‌, ఆమె సోదరుడు ఫినియాస్‌.. గాజాకు మద్దతిస్తూ ప్రత్యేక బ్యాడ్జీని ధరించడం గమనార్హం. మరికొందరు ప్రముఖులూ వీరి బాటలోనే పయనిస్తూ గాజాకు మద్దతు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version