జపనీయులనూ ఫిదా చేస్తున్న రామ్ చరణ్.. ఫస్ట్ డే కలెక్షన్స్​తో ‘రంగస్థలం’ బ్లాక్​బస్టర్ రికార్డ్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్​గా మారిపోయాడు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ గురించి తెలుసుకున్న అంతర్జాతీయ ప్రేక్షకులు.. ఆర్ఆర్ఆర్​కు ముందు చరణ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సినిమాలు చూసి ఈ హీరో స్టామినా ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు నిర్మాతలు. చరణ్ ఇమేజ్​ను దృష్టిలో ఉంచుకుని ఈ హీరో నటించిన ఓ సినిమాను జపాన్​లో విడుదల చేశారు. ఇప్పటి వరకు జపాన్​లో ఎన్టీఆర్​కు ఉన్న క్రేజ్ గురించి మనకు తెలుసు. కానీ ఈ చిత్రానికి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చూస్తే రామ్ చరణ్​ హవా ఏంటో కూడా తెలిసిపోతుంది.

టాలీవుడ్ లెక్కల మాస్టారు.. అదేనండి డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో నటన అదరగొట్టిన విషయం తెలిసిందే. అప్పటి వరకు చరణ్ నటనపై కాస్త డౌట్ ఉన్న ప్రేక్షక వర్గానికి ఈ సినిమాతో ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. చరణ్​లో ది బెస్ట్ నటుడు ఉన్నాడని వాళ్లు కూడా నమ్మేశారు. 2018 మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన రంగస్థలం చరణ్‌ను నటుడిగా మరో రేంజ్‌కు తీసుకెళ్లిపోయింది.

అయితే రంగస్థలం మూవీ జపాన్‌లో విడుదలైంది. జపనీస్ ఫ్యాన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రామ్ చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు. అందుకే కలెక్షన్స్​లోనూ ఈ సినిమా హవా చాటుతోంది. ట్రేడ్ అనలిస్ట్‌ రమేశ్‌ బాలా అందించిన సమాచారం ప్రకారం రంగస్థలం జపాన్‌లోని వివిధ ప్రాంతాల్లో 70 థియేటర్లలో విడుదలైంది. తొలి రోజు 2.5 మిలియన్ యెన్‌ (రూ.14,79,460) వసూళ్లు చేసింది. జపాన్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా రంగస్థలం అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం చిత్రం వరల్డ్‌ వైడ్‌గా మొత్తం రూ.215 కోట్లకుపైగా గ్రాస్‌ను రాబట్టి అప్పట్లో టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడు ఖండాంతరాల్లో తన సత్తా చాటుతూ ఇండియన్‌ సినిమా గొప్పదనాన్ని మరోసారి చాటి చెబుతోంది. అంతే కాకుండా రామ్ చరణ్​ పాపులారిటీని మరింత పెంచేస్తోంది. జపాన్‌లోని ఓ థియేటర్‌లో జపనీస్‌ భాషలో డిజైన్ చేసిన రంగస్థలం పోస్టర్‌ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రంగస్థలం అనే గ్రామం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. జగపతిబాబు విలన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. పూజా హెగ్డే జిగేలు రాణి అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ భరద్వాజ్‌ ఆ పాత్రతో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version