సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు అయింది. సెక్షన్ 105, 118 బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వస్తున్న సమాచారాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాంశ్ యాదవ్ వివరాలను వెల్లడించారు. బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్ కు వస్తారమే సమాచారం మాకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం మాకు సమాచారమివ్వలేదు. పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని వెల్లడించారు.