అంతర్వేది : రాక్షస సంహారం అనంతరం శ్రీహరి చక్రాయుధాన్ని శుభ్రం చేసుకున్న ప్రాంతం

-

శ్రీహరి ఆయా యుగాలలో దుష్టసంహరణ కోసం రకరకాల అవతారాలు ఎత్తుతాడు. అలాంటి అవతారంలో రక్తలోలుడిని సంహరించడానికి చక్రాయుధుడై రాక్షస సంహారాన్ని చేస్తాడు. అనంతరం స్వామి తన ఆయుధాన్ని శుభ్రం చేసుకునన ప్రాంతమే నేటి అంతర్వేది క్షేత్రం. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…

తూర్పు గోదావరి జిల్లా లో వున్న మరో పుణ్యక్షేత్రం అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలొ వుంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం…. పురాణాలలో కూడా దీని ప్రస్థావన ఉంది. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు….

ఇక్కడి స్థలపురాణంసూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.

రక్తావలోచనుని కథ హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరుతాడు. రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వర గర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు.

వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తి నుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు.

ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో వుంది.

త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ఠాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలా శాసనాలవల్ల కూడా తెలుస్తోంది.

ద్వాపర యుగంలోనూ పాండవ మధ్యముడు అర్జనుడు తీర్ధయాత్రలు చేస్తూ ‘అంతర్వేది’ దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన ‘విజయయ విలాసము’లోను, శ్రీనాధ కవిసార్వభౌముడు ‘హరివిలాసం’లోను వర్ణించారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం క్రీ.శ. 300 ఏళ్ళకు పూర్వం నిర్మంపబడిందని తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది. నేడు ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది.

దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు

వశిష్ఠాశ్రమం: సముద్రతీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం వుంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో నాలుగు అంతస్థులుగా నిర్మించారు. చూట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో వుంది ఈ కట్టడం. దగ్గరలో ధ్యానమందిరం, యోగశాల మొదలైనవి వున్నాయి. పర్ణశాలలో యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆధునికంగా నిర్మతమైన ఈ వశిష్ఠాశ్రమం కూడా దర్శనీయ స్థలం ఇక్కడ ఉంటుంది. అన్నాచెల్లెళ్ళగట్టు సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసేచోటును అన్నాచెల్లెళ్ళ గట్టు అంటారు. ఇక్కడు సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి వుంటుంది. దానికి అటు వైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలలో కూడా ఇలాగే వుంటుంది.

అళ్వరూడాంబిక ఆలయం (గుర్రాలక్క) లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూడాంబికాలయం ఉంది. నరసింహస్వామికి రక్తావలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తావలోచనుడి రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతి అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తావలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పిల్చేస్తూ అతని మరణానికి కారణమౌతుంది. అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూడాంబికగా వెలిసింది.

రవాణా సౌకర్యాలు

 అంతర్వేది చేరుకోవటానికి రాజమండ్రి నుంచి రాజోలు మీదుగా సఖినేటిపల్లి చేరుకోవచ్చు. లేదా నరసాపూర్ వచ్చి అక్కడి నుంచి గోదావరి పాయ పడవలో దాటి సఖినేటి పల్లి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు.

 కేశవ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version