భారత్, రష్యా మధ్య మైత్రి ఇప్పటిది కాదు. అమెరికా కంటే ముందు నుంచే రష్యా భారత్‌కు మంచి మిత్రదేశంగా కొనసాగుతూ వస్తోంది. ఆ ఆనవాయితీని ఇరుదేశాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇరుదేశాధినేతలు మారినా ఇరుదేశాల మైత్రివిధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని కొనియాడారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
సోచిలోని వాల్డాయ్‌లో మీడియాతో మాట్లాడిన పుతిన్ .. ‘భారత్ ఓ గొప్ప దేశం. ఆ దేశంతో మా సంబంధాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నాం.పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతూ ఆర్థికవృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి భారత్ నిలయం. ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి ఇండియాకు అర్హత ఉంది. భద్రత, రక్షణ రంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. సంవత్సరానికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లుగా ఉంది’ అని పుతిన్ తెలిపారు.