క్షీరాబ్ది ద్వాదశిన ఏ పూజ చేయాలి?

-

కార్తీకమాసంలో ఏకాదశి తర్వాతి రోజు క్షీరాబ్ది ద్వాదశి. చాలా పవిత్రమైనరోజు. దీన్నే చిలుకు ద్వాదశి, హరిబోధిని ద్వాదశి అని కూడా వ్యవహరిస్తుంటారు. దీని ముందురోజును ఉత్ధాన ఏకాదశి అంటారు. ఈరోజు పాలసముద్రంలో శేషశయ్యపై ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శయనించి, నాలుగు నెలలు యోగనిద్రలో గడిపిన శ్రీహరి యోగనిద్ర నుంచి మేల్కొని భూమి మీద దృష్టి సారించే రోజు ఉత్ధాన ఏకాదశి. విష్ణుమూర్తి నిద్ర మేల్కొన్న తర్వాతి రోజునే క్షీరాబ్ధి ద్వాదశిగా ఖ్యాతి గడించింది. ఈ రోజున తులసి, ఉసిరిచెట్ల వద్ద పూజచేయాలి. ఉసిరి చెట్టు వద్ద ఎనిమిది దిక్కుల ఎనిమిది దీపాలు పెట్టాలి. తర్వాతి కుంకుమ, పసుపు, అక్షితలతో దీపారాధన పూజచేయాలి. ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. ఈ విధంగా చేయడంవల్ల అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అనుకూలమవుతాయని శాస్త్రం పేర్కొన్నది. తులసీ ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామిగా భావించి ఈ పూజను చేయాలి.

ముఖ్యంగా చాలామంది చేసే పెద్దపొరపాటు ఉసిరి చెట్టులేదని బజార్లలో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్లి తులసి వద్ద పెట్టి పూజ చేస్తుంటారు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవడం లేదా నర్సరీ (చెట్టు పెంచే)వద్ద చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకునైనా పూజచేసుకుంటే మంచిది. కార్తీకమాసంలో ఎట్టిపరిస్థితుల్లో ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం. సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఉసిరిచెట్టు. అత్యంత భక్తి శ్రద్ధలతో ధాత్రి పూజ(ఉసిరి) చేయాలి. ఈ పరంపర నుంచే పుట్టిన అంశం వనభోజనాలు. తోటలు, ఊరికి దగ్గర్లోని వనాల్లోకి వెళ్లి ఉసిరివద్ద విష్ణు, శివ, లక్ష్మీపూజలు ఆచరించి అక్కడే వండిన ఆహారపదార్థాలను దేవుడికి నివేదించి, అనంతరం అందరూ సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరించడం. ఉల్లాసంగా ఆ రోజును ఆస్వాదించడం ఆరంభమైంది.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version