ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమశని ఉన్నవారు శని పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే శని పూజ ఎలా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అనే విషయమై ప్రముఖ పండితుల సూచనలు, సలహాలు మీ కోసం…
తెల్లవారుఝామున అభ్యంగనస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దేవాలయానికి వెళ్లాలి. నవగ్రహాలలో పశ్చిమ ముఖాభి మూర్తికి పూజ చేయాలి. ఏ ద్రవ్యాలతో పూజచేయాలి..
పసుపు, కుంకుమ, నల్లని పూలు/వాయిలెట్ పూలు, నల్లని వస్త్రం, నువ్వుల నూనె, ఇనుప మేకు (చీల), రాళ్ల ఉప్పు, నిమ్మకాయలులతో శనేశ్చరునికి అభిషేకం చేయాలి. అదేవిధంగా పూలమాల, విడిపూలు, ఊదుబత్తీలు, కర్పూరం, గంధం తదితర పూజా ద్రవ్యాలను తీసుకుని వెళ్లి అక్కడ అర్చకులు/పూజారి చెప్పిన విధంగా చేసుకోండి.
రుద్రాభిషేకం, శని అష్టోతరం చెప్పించుకోండి. మంచి ఫలితం వస్తుంది .పూజానంతరం వీలున్నవారు స్నానం ఆచరించి (కట్టుకున్న దుస్తులను మార్చుకోండి, వేరే దుస్తులు ఇంటి నుంచి తీసుకెళ్లిన రెండో జత వేసుకోండి) పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షణ చేసి తీర్థం తీసుకోండి. అవకాశం లేని వారు తప్పనిసరిగా కాళ్లు కడుక్కొని నీటిని మూడుసార్లు ఆచమనం చేసి పక్కన ప్రాంగణంలోని ఇతర దేవతామూర్తులకు ప్రదక్షణ చేసి తీర్థం తీసుకుని వెళ్లండి.
వెళ్లే సమయంలో ఇవి చేస్తే….
– దేవాలయం ముందు ఉండే వికలాంగులకు తప్పక దానం చేయండి.
– గోవులు, నల్లటి మేకలు కన్పిస్తే తప్పక వాటికి పండ్లు తినిపించండి.
– అవకాశం ఉన్నవారు నల్లటి వస్ర్తాలు, ఉప్పు, నువ్వులు, దక్షిణ,తాంబూలన్ని అక్కడి పూజరులకు/అర్చకులకు లేదా యాచకులకు దానం చేయండి.
– వేంకటేశ్వర అష్టోతరం/విష్ణుసహస్రనామం, శివాష్టోతరం లేదా ఓం నమఃశివాయ పంచాక్షరి పఠించుకుంటూ వెళ్లండి.
– ఈ రోజు ఒక్కపూట భోజనం చేయండి. నాన్‌వెజ్, మద్యపానాలకు దూరంగా ఉండండి. రాత్రికి అరోగ్యంగా ఉన్నవారు పండ్లు, పాలు తీసుకోండి. షుగర్ ఇతర సమస్యలు ఉన్నవారు ఉండలేనివారు అల్ఫాహారం స్వీకరించి వీలైనంత వరకు కింద చాపవేసుకుని నిద్రించండి.
– అన్నదానం, గోసేవ, రావిచెట్టు ప్రదక్షణలు ఆచరించండి. మంచి ఫలితం వస్తుంది.
పూజ చేసుకోలేని వారు ఏం చేయాలి?
శనిత్రయోదశి నాడు అందరూ పూజ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అయినంతమాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మీమీ దైనందిన కార్యక్రమాలను చేసుకోండి. కాకపోతే పైన చెప్పిన విధంగా మద్యం, నాన్‌వెజ్ తీసుకోకండి. ఇంట్లోనే పొద్దున దీపారాధన చేసి శని అష్టోతరం / దశరథకృత శనిస్తోత్రం / విష్ణుసహస్రనామాలు / శివనామాలు / గోవింద నామాలు పఠించండి లేదా వినండి. జీహెచ్‌ఎంసీ రూ.5 పథకం ఉన్న ప్రాంతాలకు వెళ్లి మీ శక్తి మేరకు పేదలకు భోజనానికి ధనసహాయం చేయండి. పేదలకు వస్త్రదానం, రోడ్డుపక్కన పడి ఉన్న బీదవారు, వికలాంగులు, యాచకులకు మీ శక్తి మేరకు సహాయం చేయండి. రోజంతా పనిచేసుకుంటూనే వీలైనంత దేవనామస్మరణ చేయండి.
నవగ్రహప్రదక్షణలు, శివాలయ, విష్ణు ఆలయం, హనుమాన్ దేవాలయ సందర్శన, ప్రదక్షణలు చేయండి. రావిచెట్టు ప్రదక్షణ, తగిలి నమస్కారం చేయండి. పై పూజలను నమ్మకంతో ఆచరిస్తే తప్పక శని శాంతించి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. పెద్ద సమస్యలను చిన్నవిగా చేసి మిమ్నల్ని రక్షిస్తాడు. ఈ విశేషాలను ఆయా పురాణాలలో పేర్కొన్నవి. నమ్మకంతో ఆచరించండి శని చల్లని దయకు పాత్రులు కండి. జై హనుమాన్.
– కేశవ