వారాహీ అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు.
దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు…దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు…ఈ తల్లి ప్రాణ సంరక్షిణి….ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం అవుతుంది. అంటే మనలోని అంతః శత్రవులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, నశిస్తాయి. ఇక వీటితో బాహ్యప్రపంచంలో కూడా శత్రుభావన ఉండదు. శత్రు ఆలోచన ఉండదు. అమ్మవారి అనుగ్రహంతో పంటలు పండటమే కాకుండా ప్రకృతి ప్రకోపాలు నశిస్తాయి.
-శ్రీ