శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి..
ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసం.
ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపిస్తుంది. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగా నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
సోమవారం ప్రత్యేకత
ఈ మాసం లో వచ్చే సోమవారాలలో శివ భక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవి కి కుంకుమ పూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడం గా నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో సోమవారాలను ఎక్కువగా పాటిస్తారు. ఉత్తరాదిలో శివాలయాలల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు.
శ్రావణ మంగళవారం
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా ప్ళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లి కి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి ప్ళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకొంటారు.
వరలక్ష్మీ వ్రతం
ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదోవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది. లక్ష్మి దేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్ట శక్తులని అష్టలక్ష్ములు గా ఆరాదిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటిని రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మి దేవికి అత్యంతప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నిచేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతి లో ఆచరించిన సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మి దేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం.
శ్రావణ శనివారాలు
ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా శ్రావణ శనివారాలలో ఉపవాసం ఉండి శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన, దేవాలయ ప్రదక్షిణలు, పిండితోచేసిన దీపాలలో దీపారాధన, గోసేవ చేస్తే తప్పక కోరినకోరికలు నెరవేరుతాయని పండితులు పేర్కొంటున్నారు.
శ్రావణ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి , జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి . జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రిదేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేస్తారు. అంటే కొత్తగా ఉపనయనం అయినవారికి ప్రత్యేక హోమం, పూజలతో చేసే కార్యక్రమం.
రక్షా బంధనం
శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజా శక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయం లో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక , కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది.శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువు కు అత్యంత ప్రీతి కరమైన రోజు కావున ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఇది ఎప్పటి నుండో వస్తున్న శాస్త్ర విజ్ఞాన సంప్రదాయమేనని తెలుస్తోంది.
– కేశవ