విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజున దుర్గమ్మ.. మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
మహిషాసురమర్దని అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడు, లోకకంఠకుడైన మహిషాసురుడిని సంహరించి.. దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వలన సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మహిషాసురమర్దనిగా ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. దసరా ఉత్సవాల్లో పదో రోజైన రేపు రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. రేపటితో ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ముగియనున్నాయి.
వరుసగా మూడో ఏడాది దుర్గమ్మ తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. కృష్ణా నదికి వరదనీరు ఎక్కువగా వస్తున్నందున దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించాల్సిన తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దుర్గా ఘాట్ వద్ద హంస వాహనంపై పూజల నిర్వహణకే అనుమతించినట్లు చెప్పారు.