గోదానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి?

-

గోదానం.. ఏ కార్యమైనా విశేషంగా చెప్పేది గోదానం చేయమని. గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహం ఇవేకాకుండా పితృకార్యాలలో కూడా ప్రధానంగా చేసే దానం గోదానం. గోదాన ప్రాధాన్యాన్ని భీష్మ పితామహుడు గోదాన విశిష్టతను ధర్మరాజుకు తెలియజేశాడు. ఆ విషయాలు తెలుసుకుందాం… కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి అవి కనిపించలేదు. నది పొంగడంతో అవి నదీ గర్భంలో కలిసిపోయాయి.

తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నాచికేతున్ని నరకానికి వెళ్లు అని శపించాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నాచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి. తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. సూర్యోదయ సమయానికి నాచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు. నాచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు.

ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపొమ్మని శాపం ఇవ్వలేదు కనుక నాచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నాచికేతుడు తెలిపాడు. అనంతరం నాచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొన్నట్టు అతను తెలిపాడు. అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.

శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ.. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నాచికేతుడు తండ్రికి తెలిపాడు. ఆ విషయాలు విన్న ధర్మరాజు భీష్ముడికి ప్రణామం చేసి వెళ్లిపోతాడు. పైన చెప్పిన వృత్తాంతం తెలిసిన మీరు సైతం జీవితంలో ఒక్కసారైనా గోదానం చేసి పుణ్యాన్ని పొందండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version