వసంత పంచమినాడు ఎలా పూజించాలో తెలుసా ?

-

జనవరి 30 వసంతపంచమి. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అంటారు. ఈ రోజు సరస్వతీ పూజ నిర్వహించడానికి చాలా ప్రశస్తమైన రోజు. వసంత పంచమి రోజును సరస్వతీ దేవి పుట్టిన రోజుగా పేర్కొంటారు.
మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ
పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయతః శుచిః
అంటే ఈ ఏడాది జనవరి 24వ తేదీన వచ్చిన మాఘ శుక్ల పంచమినాడు, విద్యారంభం నాడు సరస్వతిని అర్చించాలి. మొదట విఘ్నాధిపతి గణపతిని పూజించి, అటుపై చదువుల తల్లి శారదమాత ప్రతిమను, పుస్తకాలను, విద్యకు సంబంధించిన ఇతర వస్తువులను ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతి మాతను పూజించాలి.తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్ల వస్త్రాలతో ఆ విజ్ఞాన మూర్తిని అర్చించాలి. ఉత్తర భారతదేశంలో శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవిని అత్యంత శ్రద్ధతో పూజిస్తారు.

Saraswati Puja On vasantha Panchami

దక్షిణాదిలో కూడా చాలామంది ఈరోజున సరస్వతీ దేవిని అర్చిస్తారు. సాధారణంగా దేవాలయలలో మూడు రోజులపాటు వసంత పంచమిని జరుపుకుంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలసి కనకదుర్గమ్మకు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవి అలంకారం చేస్తారు. అలాగే బాసరలో కొలువై వున్న సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆదిశంకరుడు తాను అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారదాదేవి. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారన్న నమ్మకం అనాది నుంచీ వుంది. పూర్వం ‘యాకుందేందు…’ అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ. వాక్కుకీ, జ్ఞానానికీ చదువుకి ఆమె అధిదేవత. వేదాల్లో కూడా సరస్వతీ సూక్తాలున్నాయి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. విద్యార్థులు భక్తితో చదువుల తల్లిని ఆరాధిస్తే తప్పక చదువులో బాగా రాణిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version