పూరీ జ‌గ‌న్నాథుని యాత్ర‌కు ముందు జ‌రిగే న‌వ క‌ళేబరోత్స‌వం గురించి తెలుసా..?

-

పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్రకు ముందు న‌వ క‌ళేబరోత్స‌వం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. కానీ ఇది ప్ర‌తి ఏడాది జ‌ర‌గ‌దు. కేవ‌లం అధిక ఆషాఢ మాసం వ‌చ్చిన‌ప్పుడే ఈ వేడుక‌ను నిర్వ‌హిస్తారు.

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ఉన్న జ‌గ‌న్నాథ స్వామికి ఏటా జ‌రిగే ర‌థ‌యాత్రకు ఎంత‌టి విశిష్ట‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర అంటే.. అది కేవ‌లం ఆ ప్రాంతానికే ప‌రిమితం కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల‌కు ఒక గొప్ప పండుగ‌.. ఒక ఉత్స‌వం.. ఒక ఆధ్యాత్మిక సంబురం… ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది ఈ యాత్ర‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పూరీకి త‌ర‌లి వ‌స్తుంటారు. అయితే ఈ సారి కూడా ఈ ఉత్స‌వం మ‌రో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. జూలై 4వ తేదీన పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఈ యాత్ర‌ను చూసేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు ఇప్ప‌టికే పూరీకి చేరుకోగా.. మ‌రో 2, 3 రోజుల్లో ఆ క్షేత్రం భ‌క్తుల‌తో సంద‌డిగా మార‌నుంది.

అయితే పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్రకు ముందు న‌వ క‌ళేబరోత్స‌వం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. కానీ ఇది ప్ర‌తి ఏడాది జ‌ర‌గ‌దు. కేవ‌లం అధిక ఆషాఢ మాసం వ‌చ్చిన‌ప్పుడే ఈ వేడుక‌ను నిర్వ‌హిస్తారు. ఈ క్రమంలోనే చివ‌రిసారిగా 2015లో ఈ వేడుక జ‌ర‌గ్గా.. మ‌ళ్లీ ఈ వేడుక‌ను 2035లో నిర్వ‌హిస్తారు. అయితే ఈ వేడుక‌లో ఉప‌యోగించే పూరీ జ‌గ‌న్నాథుడి చెక్క విగ్ర‌హంతోపాటు బ‌ల‌భ‌ద్ర‌, సుభ్ర‌ద‌ల చెక్క విగ్ర‌హాల‌ను కూడా మారుస్తారు. వాటి స్థానంలో కొత్త విగ్ర‌హాల‌ను అమ‌రుస్తారు. సాధార‌ణంగా ఈ న‌వ క‌ళేబరోత్స‌వం 8, 11, 19 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో జ‌రుగుతూ ఉంటుంది. గ‌తంలో 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996 సంవ‌త్స‌రాల్లో ఈ వేడుక‌ను నిర్వ‌హించారు.

న‌వ క‌ళేబ‌రోత్స‌వంలో భాగంగా పూరీ జ‌గ‌న్నాథుడు, బ‌ల‌భ‌ద్ర‌, సుభద్ర‌ల‌కు చెందిన కొత్త చెక్క విగ్ర‌హాల‌ను త‌యారు చేసి ఆయా విగ్ర‌హాల నాభి భాగంలో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చూడ‌ని బ్ర‌హ్మ ప‌దార్థం అనే ఓ ప‌దార్థాన్ని ఉంచుతారు. అలా బ్ర‌హ్మ ప‌దార్థాన్ని విగ్ర‌హాల్లో ఉంచ‌డాన్నే న‌వ క‌ళేబ‌రోత్స‌వం అంటారు. అయితే ఎప్పుడూ అవే విగ్ర‌హాల‌ను వాడ‌వ‌చ్చు క‌దా.. కొత్త విగ్ర‌హాలు ఎందుకు ? అనే సందేహం అంద‌రిలోనూ క‌లుగుతూ ఉంటుంది. దానికి కూడా ఒక వివ‌ర‌ణ ఉంది. అదేమిటంటే…

హిందూ ధ‌ర్మం ప్ర‌కారం.. మ‌నిషి చ‌నిపోయి ఒక శ‌రీరాన్ని విడిచిపెడితే మ‌రొక శ‌రీరంలోకి ప్ర‌వేశించి బ‌త‌కాల్సి ఉంటుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకే న‌వ క‌ళేబ‌రోత్స‌వంలో కొత్త విగ్ర‌హాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఉప‌యోగిస్తుంటారు. అయితే ఈ సంప్ర‌దాయం ఇప్ప‌టిది కాదు.. ఆల‌యాన్ని నిర్మించిన తొలినాళ్ల నుంచే దీన్ని పాటిస్తూ వ‌స్తున్నారు. అందుకే ఇప్ప‌టికీ ఈ వేడుక కొన‌సాగుతూనే వ‌స్తోంది. అయితే న‌వ క‌ళేబ‌రోత్స‌వం వేడుక‌ను నిర్వ‌హిస్తున్నారంటే.. అంత‌కు 65 రోజుల ముందు నుంచే విగ్ర‌హాల‌ను త‌యారు చేసే ప‌నిలో ఉంటారు. దానికి సంబంధించిన ఇత‌ర ప‌నుల‌ను కూడా అప్పుడే మొద‌లు పెడ‌తారు.

ఇక న‌వ క‌ళేబ‌రోత్స‌వంలో భాగంగా ఉప‌యోగించే ఆ మూడు విగ్ర‌హాల‌ను ఒక్కో ర‌క‌మైన చెక్క‌తో త‌యారు చేయాల్సి ఉంటుంది. ఆ చెక్క‌ను సేక‌రించే చెట్టు కొన్ని ల‌క్ష‌ణాల‌ను కూడా క‌లిగి ఉండాలి. అలాంటి ల‌క్ష‌ణాలుండే చెట్ల‌ను వెదికి, చివ‌ర‌కు ఒక్కో విగ్ర‌హం త‌యారీకి ఒక్కో చెట్టును ఎంపిక చేసి, ఆ విగ్ర‌హాల‌ను చెక్కుతారు. ఇక ఆ చెట్ల‌ను ఎంపిక చేసే ప‌నిని బ్రాహ్మ‌ణులు తీసుకుంటే.. చెట్ల ఎంపిక అనంతరం విశ్వ‌కర్మ‌లు విగ్ర‌హాలను చెక్కుతారు. అయితే విగ్ర‌హాల కోసం చెట్ల‌ను కూల్చేందుకు నేరుగా ఇనుప వ‌స్తువులు వాడ‌రు. ముందుగా బంగారు, వెండి గొడ్డ‌ళ్ల‌ను చెట్ల‌కు తాకిస్తారు. ఆ త‌రువాతే ఇనుప గొడ్డ‌లితో చెట్ల‌ను కూలుస్తారు. అనంత‌రం చెట్టులోంచి అవ‌స‌ర‌మైన క‌ల‌ప‌ను తీసుకున్నాక మిగిలిన దాన్ని పూడుస్తారు. ఆ త‌రువాత ఆ క‌లప‌ను చింత‌, ప‌న‌స‌, రావి క‌ల‌ప‌తో త‌యారు చేసిన బండిలో పూరీ వ‌ర‌కు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా, భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో త‌ర‌లిస్తారు. అనంత‌రం జ‌గన్నాథుని ఆల‌యంలోని కైవ‌ల్య మందిరానికి ఆ క‌ల‌ప చేరుకుంటుంది.

అలా క‌ల‌ప మందిరానికి చేరుకున్నాక యాత్ర‌కు 45 రోజుల ముందు విగ్ర‌హాల‌ను చెక్కుతారు. విగ్ర‌హాలు చెక్క‌డం, రంగులు అద్ద‌డం పూర్త‌య్యాక యాత్ర‌కు ముందు రోజు అస‌లు ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తారు. అదే.. ఆ విగ్ర‌హాల నాభి స్థానంలో బ్ర‌హ్మ ప‌దార్థం ఉంచ‌డం. దీన్ని చాలా ర‌హ‌స్యంగా నిర్వ‌హిస్తారు. అయితే అసలు ఆ బ్ర‌హ్మ ప‌దార్థం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది..? అన్నది ఎవ‌రికీ తెలియ‌దు. దాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఆ ఆల‌యంలోని పండితులు కూడా చూడ‌లేదు. ఎప్ప‌టి నుంచో ఆ బ్ర‌హ్మ ప‌దార్థాన్ని జగన్నాథ, బలభద్ర, సుభద్రల విగ్ర‌హాల నాభిల‌లో ఉంచుతూ వ‌స్తున్నారు. శ్రీ‌కృష్ణుడి పుట్టిన రోజైన కృష్ణ చ‌తుర్ద‌శి నాడు ఈ బ్ర‌హ్మ ప‌దార్థాన్ని పాత విగ్ర‌హాల నుంచి తీసి కొత్త విగ్ర‌హాల నాభిల‌లో ఉంచుతారు.

అయితే ఈ బ్ర‌హ్మ ప‌దార్థం మార్పిడి ప్ర‌క్రియ చాలా ర‌హ‌స్యంగా, అత్యంత నియ‌మ‌, నిష్ట‌ల‌తో జ‌రుగుతుంది. పూరీ జ‌గ‌న్నాథుని శ్రీ‌మందిరంలోనే ఈ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌డానికి ముందు ఆలయాన్ని మొత్తం ఎవ‌రూ లేకుండా జ‌ల్లెడ ప‌డ‌తారు. ఆ త‌రువాత కొత్త విగ్ర‌హాల‌ను పాత విగ్ర‌హాల వ‌ద్ద ఉంచుతారు. అనంత‌రం బ్ర‌హ్మ ప‌దార్థాన్ని మార్చే న‌లుగురు దైతాధిప‌తుల క‌ళ్ల‌కు 7 పొర‌లుగా వ‌స్త్రాల‌ను క‌డుతారు. అనంత‌రం గ‌ర్భ‌గుడిలో క‌టిక చీక‌టిగా ఉండేలా చేస్తారు. ఆ త‌రువాత పూరీ ప‌ట్ట‌ణం మొత్తం విద్యుత్ తీసేస్తారు. త‌రువాత ఆ దైతాధిప‌తులు గ‌ర్భ‌గుడిలోకి ప్రవేశిస్తారు.

అలా దైతాధిప‌తులు గ‌ర్భ‌గుడిలోకి వెళ్లి పాత విగ్ర‌హాల నాభిల‌లో ఉన్న బ్ర‌హ్మ ప‌దార్థాన్ని తీసి కొత్త విగ్ర‌హాల నాభిల‌లో ఉంచుతారు. అనంత‌రం వారు బ‌య‌ట‌కు వ‌స్తారు. దీంతో న‌వ క‌ళేబ‌రోత్స‌వం పూర్త‌వుతుంది. దేవ‌తా మూర్తుల‌కు న‌వ క‌ళేబ‌రం ప్రాప్తించిన‌ట్లు భావిస్తారు. ఆ త‌రువాత ర‌థ‌యాత్రకు ఏర్పాట్లు జ‌రుగుతాయి. అందులో భాగంగా ముందుగా పాత విగ్ర‌హాల‌ను శాస్త్రోక్తంగా భూస్థాపితం చేస్తారు. వాటికి క‌ర్మ‌కాండ‌లు నిర్వ‌హిస్తారు. అనంత‌రం పూరీ జ‌గ‌న్నాథ ఆల‌యంలో ప‌లు ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ర‌థ‌యాత్రకు 2 రోజుల ముందుగానే కొత్త విగ్ర‌హాల‌కు నేత్రోత్స‌వం నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత రోజు న‌వ య‌వ్వ‌న ద‌ర్శ‌నం ఉంటుంది. ఇక ర‌థ‌యాత్ర కోసం మూడు కొత్త ర‌థాల‌ను సిద్ధం చేస్తారు. పూరీ రాజు బంగారు చీపురుల‌తో ర‌థాల ముందు ఊడ్చాక తాళ్ల‌ను లాగుతారు. దీంతో ర‌థ‌యాత్ర ప్రారంభ‌మ‌వుతుంది. అనంత‌రం జ‌గన్నాథ దేవాల‌యం నుంచి 3 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గుడించా ఆల‌యం వ‌ర‌కు యాత్ర కొన‌సాగుతుంది. అయితే ఈ దూరం ప్ర‌యాణించేందుకు క‌నీసం 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. గుడించా ఆల‌యానికి చేరుకున్నాక అక్క‌డ వారం రోజుల పాటు విగ్ర‌హాల‌కు ఆతిథ్యం ఉంటుంది. అనంత‌రం విగ్ర‌హాలు తిరుగు ప్ర‌యాణమై పూరీ జ‌గ‌న్నాథుని ఆల‌యానికి చేరుకుంటాయి. ఈ విగ్ర‌హాల‌ను గ‌ర్భ‌గుడిలోని ర‌త్న సింహాస‌నంపై ప్ర‌తిష్టిస్తారు. దీంతో ర‌థోత్స‌వ కార్య‌క్ర‌మం పూర్తయిన‌ట్లు భావిస్తారు. ఇక ర‌త్న సింహాస‌నం మీద ఉండే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్ర‌హాలు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. వారిని ద‌ర్శించుకునేందుకు ఎంతో మంది భ‌క్తులు వ‌స్తారు..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version