హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మాఘ మాసం అత్యంత పవిత్రమైనది. చలి పులిలా వణికిస్తున్నా తెల్లవారుజామునే నదీ స్నానం చేసే భక్తుల సందడి మనకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇస్తుంది. జనవరి 19 వ తేది నుండి మాఘమాసం మొదలైనది. అసలు ఈ చలిలో నదిలో మునక వేయడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? ఇది కేవలం నమ్మకమేనా లేక ఆరోగ్య రహస్యమా? మాఘ స్నానం సర్వపాప హరణం అని పెద్దలు ఎందుకు అంటారో ఈ పవిత్ర మాసంలో నదీ స్నానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రయోజనాలను సులువుగా తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక పుణ్యఫలం – మోక్ష మార్గం: మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నప్పుడు నదులన్నీ గంగా నదితో సమానమైన పవిత్రతను పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో చేసే తెల్లవారుజాము స్నానాన్ని ‘బ్రహ్మ ముహూర్త స్నానం’ అంటారు. ఇలా చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోవడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ముఖ్యంగా ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో త్రివేణి సంగమ స్నానం అత్యంత శ్రేష్టమని చెబుతారు. ఈ మాసంలో నదీ జలాలు దైవ శక్తిని కలిగి ఉంటాయని ప్రతి రోజూ స్నానం చేయలేకపోయినా కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదిలో మునక వేస్తే సకల శుభాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

ఆరోగ్య రహస్యం – శాస్త్రీయ కోణం: నదీ స్నానం వెనుక లోతైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చలికాలంలో నదీ జలాలు ఖనిజ లవణాలతో నిండి ఉండి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. తెల్లవారుజామున చల్లని నీటిలో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యోదయానికి ముందు నదిలో మునిగినప్పుడు, గాలిలోని ఓజోన్ మరియు నీటిలోని ఔషధ గుణాలు చర్మ వ్యాధులను నివారిస్తాయి.
స్నాన విధి మరియు విశిష్టత : మాఘ స్నానాన్ని నదిలో చేయడం ఉత్తమం, కుదరని పక్షంలో ఇంట్లోనే నదులను స్మరిస్తూ స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి దీపదానం చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది. పవిత్రమైన ఆలోచనలతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది.
గమనిక: తీవ్రమైన అనారోగ్య సమస్యలు, జ్వరం లేదా శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు చల్లని నదీ స్నానాలకు దూరంగా ఉండటం మంచిది.అటువంటి వారు గోరువెచ్చని నీటితో ఇంట్లోనే స్నానం చేస్తూ ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహించుకోవచ్చు.
