తిరుమల బ్రహోత్సవ వాహన సేవల్లో పాల్గొన్నా, చూసినా ఈ ఫలాలు తథ్యం!!

-

కలియుగ దైవంగా..భక్తవత్సలుడూ అయిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి సోమవారం నుంచి బ్రహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఈ బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రతిరోజు స్వామివారిని రోజుకొక్క వాహనంలో సేవిస్తారు. తిరుమాడ వీధుల్లో స్వామి ఆయా వాహనసేవల్లో భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని ఎనిమిది రోజులపాటు ప్రతిరోజు రెండువాహనాల చొప్పున (ఉదయం, సాయంత్రం) పదహారు వాహనాలపై ఊరేగించడం సంప్రదాయం. ఆ వాహన సేవలు, అలంకారం, ఆ సేవలలో పాల్గొన భక్తులకు, చూసిన, తలచిన భక్తజనులకు వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం…

మొదటి రోజు రాత్రి: పెద్ద శేషవాహనంలో స్వామి శ్రీభూ సమేతుడై రాజమన్నార్‌ వేషధారిగా విహరిస్తాడు. ‘ఈ సప్తగిరి నాథుణ్ణి నేనే. భక్తులను ఏడు ఊర్ధ్వలోకాల పైకి నడిపిస్తూ, ముక్తిని ప్రసాదించగలను’ అనే అంతరార్థ బోధనతో ఈ ఉత్సవం జరుగుతుంది.

రెండో రోజు:  ఉదయం- చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి ఒక్కడే విహరిస్తాడు. ‘పాంచ భౌతిక శరీర తత్త్వానికి అధినాథుణ్ణి నేనే. నన్ను ఆశ్రయించి, ముక్తిని పొందగలరు’ అనే శేషశేషి భావాన్ని ఆ వాహనసేవ ప్రబోధిస్తుంది.
రాత్రి: హంసవాహన సేవ. ఇది జ్ఞానప్రబోధానికి ప్రతీక. అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. జ్ఞానాన్ని ఇస్తుంది.

మూడోరోజు: ఉదయం: సింహవాహన సేవ. శ్రీనృసింహ తత్త్వ ప్రబోధనకు ఇది ప్రతిరూపం. శౌర్య స్థైర్య ధైర్య పరాక్రమాలను బోధిస్తూ, ‘భక్త జన సంరక్షణ చేయడం పరమాత్మ తత్త్వం’ అనే ప్రబోధం ఈ సేవలోని ఆంతర్యం.
రాత్రి: ముత్యపు పందిరి వాహన సేవ. ఈ వాహనంలో స్వామి రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ రూపధారిగా కనిపిస్తాడు. ‘నేను సర్వాంతర్యామిని. భక్తజన హృదయారవిందాలలో ఉండి, రక్షించగలను’ అనే అంతరార్థాన్ని ప్రబోధిస్తాడు.

నాలుగో రోజు: ఉదయం: కల్పవృక్ష అధినాధుడై, కోరిన కోర్కెలను తీర్చే కొండంత దైవంగా భాసిల్లుతూ విరాజమానం అవుతాడు స్వామి.
రాత్రి: సర్వభూపాల వాహనంలో చతుర్దశ భువన సంరక్షకుడై, సమస్త ప్రాణికోటికీ అధినాథుడై భక్తులకు దర్శనం కల్పిస్తాడు.

అయిదోరోజు:
ఉదయం: పల్లకీలో మోహినీ అవతారంతో స్వామి దర్శనమిస్తాడు. రాక్షసభావాన్ని నశింపజేసి, దైవత్వాన్ని అందిస్తానని ప్రబోధిస్తాడు.
రాత్రి: స్వామి తిరుమల పవిత్ర వీధుల్లో గగన సంచారం చేసే గరుత్మంతుణ్ణి అధిరోహిస్తాడు. లక్ష్మీ హారాన్ని ధరించి, వైకుంఠ లోకాన్ని తలపింపజేస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు.

ఆరోరోజు:
ఉదయం: సుగుణాభిరాముడు అయోధ్యా రాముణ్ణి తలపింపజేస్తూ, హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించి, శౌర్య వీర్య గుణాలను అనుగ్రహిస్తాడు మలయప్ప.
సాయంత్రం: వసంతోత్సవం నిర్వహిస్తారు. అనంతరం పసుపు అంటే హరిద్రా వస్ర్తాలను ధరించి, దేవేరులతో స్వామి బంగారు రథంపై అధిష్ఠిస్తాడు. సువర్ణ రథ రంగ డోలోత్సవంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు.
రాత్రి: ఆర్తత్రాణ పరాయణుడూ, భక్తాభీష్ట ప్రదాత, భక్తుల పాలిట కొంగు బంగారమైన స్వామి గజవాహన సేవలో దర్శనమిస్తాడు.

ఏడోరోజు:
ఉదయం: తేజఃప్రదాతగా, ఆరోగ్యదాతగా, తమో నివారకుడిగా ఆత్మోత్తేజ ప్రదాతగా వజ్రవైఢూర్యాది ఆభరణాలను ధరించి, సూర్యప్రభ వాహనంలో దర్శనమిస్తాడు స్వామి.
రాత్రి: మనోహ్లాద కారకుడిగా బుద్ధి విశాలతను బోధిస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ వేషధారణతో మలయప్ప కనిపిస్తాడు. శరచ్చంద్ర చంద్రికా ధవళకాంతులతో అనుగ్రహిస్తాడు.

ఎనిమిదో రోజు:
ఉదయం: స్వామి రథోత్సవంలో కనువిందు చేస్తాడు. ‘అష్టదిక్పాలకులకు అధిపతిని నేనే. జగద్రక్షణభార నిర్వాహకుణ్ణీ నేనే’ అన్న సందేశాన్ని ప్రబోధిస్తూ దర్శనమిస్తాడు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులతో కూడి, రథోత్సవంలో శ్రీభూ సహితుడై విహరిస్తాడు.
రాత్రి: స్వామి ‘యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత…’ అన్నట్టు ధర్మరక్షణకూ, అధర్మ నిరసనకూ అశ్వాధిరూఢుడై, పంచాయుధాలు ధరించి, కల్కి అవతార రూపంలో తిరుమాడ వీధులలో విహరిస్తాడు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version